
పాత్ మేకర్
అల్లికల నుంచి అంతరిక్షం దాకా అన్నిట్లో ఆడవాళ్ల జాడలు కనిపిస్తున్నా ఇదింకా పురుష ప్రపంచమే! అసలు ఆ జాడలు కూడా లేని కాలం ఎలా ఉండిందో! అలాంటి కాలంలో పురుషాధిపత్య రంగాల్లోకి స్త్రీలు ధైర్యంగా అడుగుపెట్టడమే ఓ సమరం! పెట్టాక బాధ్యతల కోసం ఒక పోరాటం! అలా పోరాడి.. పురుషులు సాధించలేని టాస్క్‌లను ఛేదించి.. తర్వాత తరాల అమ్మాయిలకు ఓ పాత్‌ను క్రియేట్ చేశారు కొందరు వనితలు! ఆషీరోస్‌ను పరిచయం చేసే శీర్షికే ‘ పాత్ మేకర్’. ఆక్రమంలో ఈ వారం.. దేశపు తొలి మహిళా వార్ జర్నలిస్ట్ ప్రభాదత్ గురించి...
బిల్లా, రంగా పేరు వినే ఉంటారు. గీతా, సంజయ్ చోప్రా అనే ఇద్దరు స్కూల్ పిల్లలను ఎత్తుకెళ్లిపోయి, వాళ్లను హత్యచేసిన హంతకులు. మరణ శిక్షతో జైల్లో ఉన్న ఆ బిల్లా, రంగాలను ఇంటర్వ్యూ చేయడానికి ఒక జర్నలిస్ట్ .. జైల్ అధికారుల అనుమతి కోరారు. ‘నో’ అన్నారు అఫీషియల్స్. ఆ ‘నో’ను సవాలు చేస్తూ కోర్టుకు వెళ్లి, ఇంటర్వ్యూకు పర్మిషన్ తెచ్చుకుని.. ఆ ఇద్దరి మరణ శిక్ష అమలుకు ముందు వాళ్లను ఇంటర్వ్యూ చేశారు ఆ జర్నలిస్ట్. జైన్ శుద్ధ్ వనస్పతి లిమిటెడ్.. పేరు కూడా వినే ఉంటారు. ఈ సంస్థ అమ్మే నేతిలో పందికొవ్వు కలుస్తోందనే ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ చేశారు ఆ జర్నలిస్ట్.
అంతేకాదు ఎయిమ్స్‌లోని మెడికల్ స్కామ్‌నూ బయటకు తీశారు. ఆ జర్నలిస్ట్ పేరే ప్రభాదత్! 1965లో జరిగిన ఇండియా– పాకిస్తాన్ యుద్ధాన్ని వార్ ఫీల్డ్‌లోంచి రిపోర్ట్ చేసిన వీరనారి! దేశపు ఫస్ట్ ఉమన్ వార్ కరెస్పాండెంట్‌గా చరిత్ర సృష్టించారు. బక్కపల్చటి దేహం.. కాటన్ చీర.. తలకు హెల్మెట్‌తో యుద్ధ ట్యాంక్‌ల వెనుక నుంచి యుద్ధాన్ని కలంతో కవర్ చేసిన ఆమె ఇమేజ్ తర్వాత తరాల జర్నలిస్ట్‌లు ఎందరికో ప్రేరణనిచ్చింది. అందుకే ఆమెను చమేలీ దేవీ జైన్ అవార్డ్ వరించింది. ప్రభాదత్ ఏం చేసినా సెన్సేషనే! ఆమె (మగాళ్ల రాజ్యం) జర్నలిజంలోకి అడుగుపెట్టడమే మహా సంచలనం!
జర్నలిజం.. వార్ రిపోర్టింగ్
ప్రభాదత్ ఇరవైల్లోనే జర్నలిజంలోకి వచ్చారు. ఇంటర్వ్యూలో ఫ్లవర్ ఎగ్జిబిషన్‌ను కవర్ చేసే డ్యూటీని సూచించాడట ఎడిటర్. అంతకన్నా గొప్ప విషయాలనే మహిళలు రిపోర్ట్ చేయగలరు అని అతనితో వాదించి.. మెప్పించి ఫ్లవర్ ఎగ్జిబిషన్ రిపోర్టింగ్‌ను తిరస్కరించి.. కీలకమైన అసైన్‌మెంట్స్‌కే ‘యెస్’ అనిపించుకున్నారు. అలాంటి ధీర ఇండియా– పాకిస్తాన్ వార్ రిపోర్టింగ్‌ను వదులుకుంటారా? అప్పుడు ఆమె హిందుస్థాన్ టైమ్స్‌కి పని చేస్తున్నారు. తనకు వార్ అసైన్‌మెంట్ ఇవ్వమని రిక్వెస్ట్ చేయలేదు. డిమాండ్ చేశారు. ఎడిటర్ దగ్గర్నుంచి ‘నో’ అనే జవాబే వచ్చింది. అప్పుడు ఆమె స్మార్ట్ స్టెప్ తీసుకున్నారు.
పంజాబ్‌లో ఉన్న తన పేరెంట్స్‌ను చూడ్డానికి వెళ్తున్నానని సెలవుకు దరఖాస్తు పెట్టుకున్నారు. వెంటనే మంజూరైంది. పెట్టే బేడా సర్దుకుని నేరుగా ఖేమ్ – కరన్‌కి బయలుదేరారు ప్రభా. యుద్ధ రంగంలో నిలబడి ఏ రోజుకారోజు యుద్ధ విషయాల రిపోర్ట్‌ను పత్రికా ఆఫీస్‌కు పంపసాగారు. పట్టుదలకు పోయి మొదట్లో ఆ రిపోర్ట్‌ను పక్కన పెట్టినా.. తర్వాత తర్వాత ఆమె రిపోర్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవాళ్లు పత్రికా ఆఫీస్‌లో. ప్రభాదత్ కన్విక్షన్, పర్‌ఫెక్షన్ అలాంటిది మరి. రేడియోల ముందూ చెవులు రిక్కించుకుని మరీ కూర్చునేవారట శ్రోతలు.. ఆమె రిపోర్టింగ్ విషయాలను వినడానికి. మిడిమిడి జ్ఞానం ఆమె డిక్షనరీలోనే లేదు.
సంపూర్ణ అవగాహన, స్పష్టతతోనే వెళ్లేవారు ఎక్కడికైనా. పనితోనే గానీ వ్యక్తిగత చరిష్మాకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదు. తన జీవితమే రిస్క్‌లో పడేంత ప్రమాదకరమైన రిపోర్టింగ్ చేశారు. బెదిరింపులు, భౌతిక దాడులను ఎదుర్కొన్న సందర్భాలూ ఉన్నాయి. అయినా ప్రభాదత్ వెనుకడుగు వేయలేదు. తను నమ్మినదానిపట్ల దృఢచిత్తంతో సాగిన ఆమె బ్రెయిన్ హ్యామరేజ్‌తో హఠన్మరణానికి గురయ్యారు. జర్నలిజంలో ఆమె చూపిన తెగువ, ధైర్యం మహిళా జర్నలిస్ట్‌లకే కాదు పురుషులకూ స్ఫూర్తే! ప్రముఖ జర్నలిస్ట్ బర్ఖాదత్ ఆమె కూతురే.