అక్షర ధీర | successfull journey of women journalists special story | Sakshi
Sakshi News home page

అక్షర ధీర

Jan 29 2026 5:04 AM | Updated on Jan 29 2026 5:04 AM

successfull journey of women journalists special story

నేడు నేషనల్‌ న్యూస్‌ పేపర్‌ డే 

‘పత్రికొక్కటున్న పదివేల సైన్యం... పత్రికొక్కటున్న మిత్రకోటి’... ఆనాటి నార్ల వారి మాట ఇప్పటికీ శక్తిమంతమైనదే. పత్రికల శక్తిని తెలియజేసేదే! పత్రిక అంటే ప్రజల ఆత్మీయ నేస్తం. దారి చూపే దీపం. సమాజానికి ముప్పు వాటిల్లినప్పుడు పత్రిక ప్రజల గొంతుక అవుతుంది. పాశుపతాస్త్రం అవుతుంది. స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి నేటి వరకు రిపోర్టర్, ఫొటో జర్నలిస్ట్, పొలిటికల్‌ కార్టూనిస్ట్‌... వివిధ స్థాయులలో పత్రికారంగంలో మెరిసిన మహిళలు ఎంతోమంది ఉన్నారు...

జేమ్స్‌ ఆగస్టస్‌ హికీ 1780 జనవరి 29న ‘హికీస్‌ బెంగాల్‌ గెజిట్‌’ పత్రికను ప్రారంభించారు. ఇది మన దేశంలోని మొదటి వార్తాపత్రిక మాత్రమే కాదు ఆసియాలోని మొట్టమొదటి వార్తాపత్రిక కూడా. భారతదేశంలో నిశ్శబ్దంగా మొదలైన ప్రింట్‌ జర్నలిజం సామాజిక రంగాన్ని ప్రభావితం చేసే శక్తిగా ఎదిగింది. స్వాతంత్య్ర పోరాటంలో ఉద్యమకారుల గొంతుక అయింది. 

నాయకులు, విప్లవకారుల అభి్రపాయాలను సాధారణ ప్రజలకు చేరవేయడం ద్వారా రాజకీయ పరివర్తన సాధనాలుగా పనిచేశాయి. అప్పటి బ్రిటిష్‌ ఇండియాలోని కలకత్తాలో ప్రారంభమైన ‘హికీస్‌ బెంగాల్‌ గెజిట్‌’ లేదా ‘ది ఒరిజినల్‌ కలకత్తా జనరల్‌ అడ్వరై్టజర్‌’ రెండు సంవత్సరాల పాటు నడిచింది. ఈ పత్రిక నాటి గవర్నర్‌ జనరల్‌ వారెన్‌ హేస్టింగ్స్‌ పరిపాలనను తీవ్రంగా వ్యతిరేకించింది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు తొలి బీజం వేసింది.

అరుణ అడుగు జాడలలో...
భారతీయ పత్రికరంగంలో కీలక పాత్ర పోషించిన మహిళా జర్నలిస్ట్‌లలో అరుణ అసఫ్‌ అలీ మొదటి వరుసలో నిలుస్తారు. స్వాతంత్య్రోద్యమ పోరాట యోధురాలైన అరుణ 1950 చివరిలో ‘పేట్రియాట్‌’ దినపత్రికను, ‘లింక్‌’ వారపత్రికను ప్రారంభించారు. ఈ పత్రికలు కార్మికుల హక్కులు, సామాజిక న్యాయంపై దృష్టి సారించాయి. సైద్ధాంతిక చర్చలకు వేదికలయ్యాయి.

ఛాయాచిత్ర సంచలనం
ఫొటో జర్నలిజం ద్వారా ప్రింట్‌ మీడియాలో సత్తా చాటిన జర్నలిస్ట్‌ హోమై వ్యరవాలా. ‘డాల్టా’ పేరుతో సుపరిచితురాలైన ఆమె భారతదేశంలోని తొలి మహిళా ఫొటో జర్నలిస్ట్‌. రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు ఆమె ముంబైలోని ‘ది ఇలస్ట్రేటెడ్‌ వీక్లీ ఆఫ్‌ ఇండియా’ పత్రికలో పనిచేస్తున్నారు. తొలినాళ్లలో హోమై తీసిన ఫొటోలు ఆమె భర్త పేరుతో ప్రచురితమైనాయి.
‘మహిళలు అన్నిచోట్లా తిరగడం ఆరోజుల్లో చాలామంది ఇష్టపడేవారు కాదు. నేను చీర కట్టుకొని, మెడలో కెమెరాతో తిరుగుతూ ఉన్నప్పుడు నన్ను వింతగా చూసేవారు. సరదా కోసం అలా తిరుగుతున్నానని అనుకునేవారు. నన్ను సీరియస్‌గా తీసుకునేవారు కాదు. దాంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఫొటోలు తీయగలిగాను. నాపై ఎవరూ పెద్దగా దృష్టి పెట్టకపోవడం వల్ల సున్నితమైన ప్రాంతాలకు వెళ్లి కూడా ఫొటోలు తీయగలిగాను. నాకు ఎవరూ అడ్డుపడలేదు. దీంతో అరుదైన ఫొటోలు తీసి ప్రచురింపజేయగలిగాను. ఆ ఫొటోలు ప్రచురితమైన తరువాతే ఆ పనిని నేను ఎంత సీరియస్‌గా చేస్తున్నానో ప్రజలు గుర్తించారు’ అని చెబుతుండేవారు హోమై వ్యరవాలా.

మాయా జాలం!
మన దేశంలోని ప్రముఖ మహిళా రాజకీయ కార్టూనిస్ట్‌లలో మాయా కామత్‌ ఒకరు. ఆంగ్ల సాహిత్యంలో పట్టా పొందిన మాయ చిన్నప్పటి నుంచి బొమ్మలు గీస్తూ ఉండేవారు. లిన్‌ జాన్‌స్టన్‌ పుస్తకం ‘ఫర్‌ బెటర్‌ ఆర్‌ ఫర్‌ వర్స్‌’ ప్రేరణతో కార్టూన్‌లు గీయడం ప్రారంభించారు కామత్‌. ఎన్నో ప్రధాన స్రవంతి వార్తాపత్రికలలో కార్టూనిస్ట్‌గా పనిచేశారు. ‘సక్సెస్‌ఫుల్‌ ఉమెన్‌ కార్టూనిస్ట్‌’ గా గుర్తింపు తెచ్చుకున్నారు.
‘కర్ణిక కహెన్‌’ అనే కార్టూన్‌ క్యారెక్టర్‌ను సృష్టించి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు కనికా మిశ్రా. దేశంలో జరిగే సంఘటనపై వ్యాఖ్యనించేలా ‘సామాన్య పురుషుడు’ కార్టూన్‌ క్యారెక్టర్‌లు ఎన్నో వచ్చాయి. దీనికి భిన్నంగా ‘కర్ణిక కహెన్‌’ను తీసుకువచ్చారు.

సామాన్య మహిళలే సారథులు
వివిధ సామాజిక సమస్యలపై పోరాడుతూ పైకి ఎదిగిన మహిళ కవితా దేవి. బుందేల్‌ఖండ్‌ గ్రామీణ ప్రాంతానికి చెందిన కవిత ‘ఖబర్‌ లహరియా’ పత్రిక ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌గా దేశవ్యాప్తంగా ఎంతోమంది దృష్టిని ఆకర్షించారు. తనలాంటి భావాలు ఉన్న మహిళలతో కలిసి ‘ఖబర్‌ లహరియా’కు రూపకల్పన చేశారు. బుందేలీ, బజ్జికా, అవధిలాంటి హిందీలోని వివిధ గ్రామీణ మాండలికాలలో ఈ పత్రిక ప్రచురితమవుతుంది. బుందేల్‌ఖండ్‌లోని సామాన్య మహిళలే ఈ పత్రికకు రిపోర్టర్‌లు. సారథులు.

పిచాయ్‌– ప్రింట్‌ రీడర్‌
‘నాకు ఫిజికల్‌ పేపర్‌ చదవడం అంటేనే ఇష్టం’ అని చెబుతుంటారు సుందర్‌ పిచాయ్‌. సాంకేతిక దిగ్గజం ‘గూగుల్‌’కు  సీయివో అయిన పిచాయ్‌ నోట ఆన్‌లైన్‌ కాకుండా ‘ఫిజికల్‌ న్యూస్‌ పేపర్‌’ అనే మాట వినిపించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ‘నేను ఓల్డ్‌ స్కూల్‌’ అని చెప్పకనే చె΄్పారు పిచాయ్‌. ఈ నేపథ్యంలో ఫిజికల్‌ న్యూస్‌పేపర్లు, పుస్తకాలు చదవడం వల్ల కలగే ఉపయోగాల గురించి సామాజిక మాధ్యమాలలో చర్చ నడిచింది. సమాచారాన్ని ఎక్కువ కాలం పాటు గుర్తించడానికి ఫిజికల్‌ ఫార్మట్‌ ఉపయోగపడుతుదనే చెబుతున్నారు విశ్లేషకులు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement