‘భారత ఏఐ రంగంలో వృద్ధి వేగవంతం’ | Google announcement deepening partnership with India AI stack Sundar Pichai | Sakshi
Sakshi News home page

‘భారత ఏఐ రంగంలో వృద్ధి వేగవంతం’

Feb 18 2026 11:18 AM | Updated on Feb 18 2026 11:55 AM

Google announcement deepening partnership with India AI stack Sundar Pichai

గూగుల్ భారత్‌తో తన అనుబంధాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కొన్ని విషయాలను వెల్లడించారు. ఇండియా ఏఐ రంగంలో పురోగతి సాధిస్తున్న తరుణంలో గూగుల్ తన పూర్తి ఏఐ
వ్యవస్థలను స్థానికంగా అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు.

గూగుల్, ఇండియా ఏఐ భాగస్వామ్యం

గూగుల్ కేవలం ఒక టెక్నాలజీ ప్రొవైడర్‌గానే కాకుండా భారత ఏఐ పర్యావరణ వ్యవస్థలో ఒక సమగ్ర భాగస్వామిగా ఉండాలని నిర్ణయించుకుంది. కంప్యూట్ పవర్, మోడల్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, రీసెర్చ్ వంటి ఏఐకి సంబంధించిన అన్ని విభాగాల్లో గూగుల్ భారత్‌తో కలిసి పనిచేయనుంది. గూగుల్ తన గ్లోబల్ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం 185 బిలియన్‌ డాలర్ల భారీ మూలధన వ్యయ ప్రణాళికను ప్రకటించింది. ఇందులో గణనీయమైన భాగం భారత్‌లో డేటా సెంటర్లు, గిగావాట్ స్థాయి కంప్యూటింగ్ సామర్థ్యం, స్థిరమైన ఇంధన వనరుల కోసం కేటాయించనున్నారు.

రిలయన్స్ జియో (క్లౌడ్ రీజియన్ల కోసం), అదానీ గ్రూప్, క్లీన్‌మ్యాక్స్ (పునరుత్పాదక ఇంధనం కోసం) వంటి దిగ్గజ సంస్థలతో గూగుల్ ఒప్పందాలు చేసుకుంది.

ఈ పరిణామం ఎందుకు కీలకం?

ఈ భాగస్వామ్యం దేశ డిజిటల్ భవిష్యత్తును మార్చబోయే ఒక వ్యూహాత్మక అడుగు. భారత ప్రభుత్వం నిర్దేశించుకున్న వికసిత్ భారత్ 2047 విజన్‌కు అనుగుణంగా ఆధునిక సాంకేతికతను సామాన్యులకు చేరవేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. గూగుల్ అత్యాధునిక ఏఐ పరికరాలు అందుబాటులోకి రావడం వల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్టార్టప్‌లు తక్కువ ఖర్చుతో ప్రపంచస్థాయి ఆవిష్కరణలు చేయవచ్చు. గిగావాట్ స్థాయి కంప్యూటింగ్, సముద్రగర్భ కేబుల్ నెట్‌వర్క్ ద్వారా భారత్ ప్రపంచానికి ఏఐ సేవలను అందించే కేంద్రంగా మారుతుంది. ఇది భారత్-అమెరికా సాంకేతిక సహకారాన్ని మరింత బలపరుస్తుంది.

భవిష్యత్తుపై అంచనాలు..

ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ మాట్లాడుతూ..‘భారతదేశం ఏఐ రంగంలో వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ పరివర్తనకు అవసరమైన మౌలిక సదుపాయాలను, క్లీన్‌ ఎనర్జీని, ఏఐకి సంబంధించి ఓపెన్ మోడల్స్‌ను అందించడమే మా లక్ష్యం’ అన్నారు. గూగుల్ ఇప్పటికే రాజస్థాన్‌లో 150 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు వంటి వాటితో తన మౌలిక సదుపాయాల కల్పనను ప్రారంభించింది.

ఇదీ చదవండి: రష్యా డాలర్లలో వ్యాపారం? భారత్‌పై ప్రభావం..

Advertisement
 
Advertisement
Advertisement