పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్
బిడ్డ పుట్టగానే ఆ ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. కాని, ఆ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి మనసులో మాత్రం చీకటి అలుముకుంటుంది. ఎప్పుడూ లేని ఆందోళన, నిరాశ, నిస్పృహలు ఆమెను ఒక్కసారిగా అలుముకుంటాయి. చాలామంది ఇదంతా బాలింతల్లో సహజమే అని సరిపెట్టుకుంటుంటారు. కానీ ఇది ఆమెను నిశ్శబ్దంగా వేధిస్తున్న పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ (ప్రసవానంతర కుంగుబాటు) అని గుర్తించరు.
⇒ ప్రసవం తర్వాత 2 నుంచి 3 రోజులు మూడ్ స్వింగ్స్ ఉండటం సాధారణం. దీనినే బేబీ బ్లూస్‌గా పిలుస్తుంటారు. కానీ, రెండు వారాల కంటే ఎక్కువ కాలం నిరాశ, ఆకలి లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, బిడ్డను ఎత్తుకోవాలనే కోరిక కలగకపోవడం, ఏదైనా హాని జరుగుతుందని భయపడుతుండటం పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ లక్షణాలు. ఒక్కోసారి ఇది తీవ్ర సమస్యలకు దారితీయవచ్చు.
⇒ దేశంలో ప్రతి ఐదుగురు తల్లులలో ఒకరు అంటే సుమారు 22% మంది ప్రసవానంతర కుంగుబాటుకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 13% మంది తల్లులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ శాతం ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం.
⇒ ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో (తెలుగు రాష్ట్రాలతో సహా) ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంది. దాదాపు 26% వరకు నమోదవుతోంది.
⇒ ప్లాన్ చేయకుండా గర్భం దాల్చిన వారిలో డిప్రెషన్ వచ్చే అవకాశం 1.5 రెట్లు ఎక్కువగా ఉంది.
⇒ గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం, పోషకాహార లోపం, మగబిడ్డ కావాలనే సామాజిక ఒత్తిడి వంటి వాటివల్ల 18% మందిలో ఈ సమస్య కనిపిస్తుంది. ఇక నగరాల్లోని మహిళలల్లో ఒంటరితనం, ఉద్యోగ ఒత్తిడి వల్ల ఈ సమస్య 24% మందిలో కనిపిస్తోంది. అంటే గ్రామాల్లో కంటే పట్టణాల్లోనే తల్లులు ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారు.
⇒ దాదాపు 70% మంది మహిళలు తమకు ఉన్న మానసిక సమస్యను బయటకు చెప్పడానికి భయపడుతున్నారు. కొంతమంది అది అనారోగ్యం అని కూడా గుర్తించలేకపోతున్నారు. కేవలం 10% నుంచి 15% మంది మాత్రమే ఈ సమస్యకు సరైన వైద్య సహాయం పొందుతున్నారు.
⇒ మన దేశంలో సామాజిక అపోహల వల్ల 60% కంటే ఎక్కువ మంది తల్లులు ఈ డిప్రెషన్‌కు చికిత్స తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. సరైన సమయంలో కౌన్సెలింగ్, కుటుంబ మద్దతు లభించిన 80% నుంచి 90% మంది మహిళలు 3 నుంచి 6 నెలల్లో పూర్తిగా కోలుకుంటున్నారు.
⇒ ఇంటి పనిలో, బిడ్డ సంరక్షణలో భర్త సహకరించడం వల్ల తల్లిపై 40% ఒత్తిడి తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కేవలం ఆర్థిక బాధ్యతలే కాకుండా, ఆమె మాటలను ఓపికగా వినడం కూడా ముఖ్యం.
⇒ సుమారు 10% మంది పురుషుల్లో (కొత్తగా తండ్రి అయిన వారు) కూడా ప్రసవానంతర డిప్రెషన్ కు గురవుతారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
⇒ ఇంటిలోని అత్తమామలు, తల్లిదండ్రులు.. మా కాలంలో ఇవన్నీ లేవు అనే విమర్శల కంటే, మేమున్నాం అనే భరోసానివ్వడం ఆమెకు కొండంత అండ. అమ్మకు కావాల్సింది కేవలం ΄ûష్టికాహారం మాత్రమే కాదు.. తగినంత నిద్ర ఉండేలా చూడటం, ఒత్తిడి లేకుండా చూడటం కుటుంబం ప్రాథమిక బాధ్యత.


