350 శాతం టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించడంతో దిగొచ్చారు
మరోసారి ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. కానీ, ఈసారి ఒక కొత్త విషయం చెప్పారు. దాడులు ప్రతిదాడులు వెంటనే నిలిపివేయకపోతే ఏకంగా 350 శాతం సుంకాలు విధిస్తానని బెదిరించడంతో ఆ రెండు దేశాలు మరో గత్యంతరం లేక దారికొచ్చాయని అన్నారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనతో వ్యక్తిగతంగా ఫోన్‌లో మాట్లాడారని, పాకిస్తాన్‌పై యుద్ధం చేయబోమని చెప్పారని స్పష్టంచేశారు. అణ్వస్త్ర దేశాలైన భారత్–పాక్ మధ్య భీకర యుద్ధాన్ని తానే చొరవ తీసుకొని ఆపేశానంటూ ట్రంప్ నోటివెంట వచ్చిన ప్రకటనల సంఖ్య 60 దాటడం గమనార్హం. రెండు దేశాల నడుమ ఘర్షణ ఆగడం వెనుక మూడో వ్యక్తి ప్రమేయం, పాకిస్తాన్ ప్రాధేయపడడం వల్లనే కాల్పుల విరమణకు అంగీకరించామని భారత్ పదేపదే చెబుతున్నా ట్రంప్ తన వైఖరి మార్చుకోవడం లేదు.
ఆయన తాజాగా యూఎస్–సౌదీ అరేబియా పెట్టుబడుల సదస్సులో ప్రసంగించారు. ‘‘భారత్–పాక్ మధ్య దాడులు ఆరంభం కాగానే ఆ రెండు దేశాల అధినేతలతో మాట్లాడా. దాడులు తక్షణమే ఆపాలని, లేకపోతే 350 శాతం సుంకాలు భరించడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించా. అంత పని చేయొద్దని భారత్, పాక్ వేడుకున్నాయి. అణ్వాయుధాలతో పరస్పరం యుద్ధం సాగిస్తే లక్షలాది మంది మరణిస్తారని చెప్పా. లాస్ ఏంజెలెస్ సిటీపై అణుధూళి పేరుకుపోతుందని వెల్లడించా. 350 శాతం సుంకాలు అనగానే రెండు దేశాలు బెదిరిపోయి నా మాట విన్నాయి.
ఒక్క మాటతో అంతా సెట్ అయిపోయింది. మొదట నాకు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నుంచి ఫోన్ వచ్చింది. యుద్ధాన్ని నిలిపివేసి లక్షలాది మంది ప్రాణాలు కాపాడినందుకు ఆయన నాకు కృతజ్ఞతలు తెలియజేశారు. తర్వాత నరేంద్ర మోదీ ఫోన్‌చేసి మాట్లాడారు. మేము చేయాల్సింది చేశాం మీరేం చేస్తారో చెప్పాలని ప్రశ్నించా. పాక్‌పై యుద్ధం చేయబోమని మోదీ బదులిచ్చారు. దాంతో మోదీకి కృతజ్ఞతలు తెలియజేశా’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సదస్సులో సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ పాల్గొన్నారు.
పదేపదే అదే మాట
350 శాతం టారిఫ్‌లు విధిస్తానని భారత్, పాక్‌లను హెచ్చరించానంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వాస్తవానికి ఆయన గతంలో మాట్లాడుతూ 200 శాతం టారిఫ్‌లు విధిస్తానని బెదిరించానని చెప్పారు. ఆ సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు అది 350 శాతానికి చేరింది. ఇంకా ఎంత పెరుగుతుందో తెలియదు. ఇదిలా ఉండగా, గురువారం వైట్‌హౌస్ ఓవల్ ఆఫీసులో డొనాల్డ్ ట్రంప్, సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఈ భేటీలోనూ ట్రంప్ తన నోటికి పనిచెప్పారు. భారత్–పాక్ యుద్ధానికి తానే ఫుల్‌స్టాప్ పెట్టేశానని పునరుద్ఘాటించారు.


