మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందంటూ చాకుతో దాడి
గుంటూరు జిల్లా తెనాలిలో ఘటన
తెనాలి రూరల్: మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందన్న కారణంతో సహ జీవనం చేస్తున్న మహిళపై ప్రియుడు హత్యాయత్నం చేశాడు. చాకుతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. తెనాలికి చెందిన 45 ఏళ్ల కందుకూరు ఉష కొన్నేళ్ల కిందట విభేదాల వల్ల భర్త నుంచి విడిపోయింది. కూరగాయల వ్యాపారం చేస్తూ జీవిస్తోంది.
తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన విజయ్ తెనాలిలోని హోటళ్లలో టీ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. అతనితో ఉషకు పరిచయమైంది. ఇద్దరూ కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఇటీవల ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని విజయ్‌కు తెలిసింది. దీంతో కొద్ది రోజులుగా ఉషతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి చాకుతో ఉషపై విజయ్ విచక్షణారహితంగా దాడి చేశాడు.
ఈ నేరాన్ని సన్నిహితంగా ఉంటున్న వ్యక్తే చేశాడని పోలీసులకు చెబితేనే.. ఆస్పత్రికి తీసుకెళ్తానని ఆమెను విజయ్ బెదిరించాడు. ఇందుకు ఆమె అంగీకరించడంతో.. వెంటనే తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు గుంటూరుకు పంపించారు. ఈ సమాచారం అందుకున్న డీఎస్పీ బి.జనార్ధనరావు, వన్ టౌన్ సీఐ వి.మల్లికార్జునరావు శనివారం ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.
అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను విచారించగా అసలు విషయం బయటపడింది. వీరిద్దరూ గతంలో ఎనీ్టఆర్ జిల్లా నందిగామలో ఉండగా.. అక్కడ కూడా ఉషతో సన్నిహితంగా ఉంటున్నాడన్న కారణంతో ఓ వ్యక్తిని విజయ్ హత్య చేశాడని డీఎస్పీ తెలిపారు. ప్రస్తుతం ఉష పరిస్థితి నిలకడగా ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మల్లికార్జునరావు వెల్లడించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.


