టైటిల్‌ ప్లీజ్‌ గురూ! | Upcoming Movies Updates in Tollywood: Care about movie titles | Sakshi
Sakshi News home page

టైటిల్‌ ప్లీజ్‌ గురూ!

Oct 10 2025 3:57 AM | Updated on Oct 10 2025 6:44 AM

Upcoming Movies Updates in Tollywood: Care about movie titles

ఒక సినిమాకు అందులోని హీరో, దర్శకుడు, హీరోయిన్‌ సెంట్రాఫ్‌ ఎట్రాక్షన్‌గా ఉంటారు. అలాగే ఆ సినిమా ప్రేక్షకులకు చేరువ కావడానికి, మరింత ప్రమోషన్‌కు ఆ సినిమా టైటిల్‌ చాలా ముఖ్యం. అందుకే టైటిల్‌ విషయంలో చాలా కేర్‌ తీసుకుంటుంది యూనిట్‌. స్టార్‌ హీరో సినిమా అయితే ఏ టైటిల్‌ పెడతారా? అని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఆ కోవకు చెందిన తెలుగు చిత్రాలు పదికి పైనే ఉన్నాయి.

ఈ చిత్రాలకు వర్కింగ్‌ టైటిల్స్‌ ఉన్నప్పటికీ, హీరో అభిమానులు ఒరిజినల్‌ ‘టైటిల్‌ ప్లీజ్‌ గురూ..!’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇందుకు తగ్గట్లుగానే ఆయా చిత్రబృందాల మేకర్స్‌ కొన్ని టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారు. మరి... ఏ హీరో సినిమాకు, ఏ టైటిల్‌ పరిశీలిస్తున్నారనే విషయంపై మీరూ ఓ లుక్‌ వేయండి.

కింగ్‌ 100
నాగార్జున కెరీర్‌లోని వందో సినిమా షూటింగ్‌ పనులు ఊపందుకున్నాయని తెలిసింది. తమిళ దర్శకుడు ఆర్‌ఏ కార్తీక్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైందని సమాచారం. నాగార్జున  పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట మేకర్స్‌. ఈ సినిమా టైటిల్‌ను గురించి కూడా ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

నాగార్జున కెరీర్‌లోని ఈ వందో సినిమాకు ‘కింగ్‌ 100’, ‘కింగ్‌ 100 నాటౌట్‌’, ‘లాటరీ కింగ్‌’ అనే టైటిల్స్‌ తెరపైకి వచ్చాయి. మరి... ఈ టైటిల్‌లో ఏ టైటిల్‌ని ఖరారు చేస్తారో మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే... నాగార్జున హీరోగా నటించిన ‘మన్మథుడు 2’ సినిమాలో కీర్తీ సురేష్‌ ఓ చిన్న గెస్ట్‌ రోల్‌ చేశారు. అలాగే కథ రీత్యా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌కు చాన్స్‌ ఉందట.

కీర్తీ సురేష్‌ ఓ లీడ్‌ హీరోయిన్‌గా చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఇంకా నాగార్జున, టబుల కాంబినేషన్‌లో ‘నిన్నే పెళ్లాడతా’ ఎంతటి బ్లాక్‌బ స్టర్‌ హిట్‌ సాధించిందో తెలిసిందే. నాగార్జున వందో సినిమాలోనూ టబు భాగమయ్యారనే టాక్‌ కూడా వినిపిస్తోంది. ఈ విషయాలపై పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్‌పై నాగార్జున నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది.

ఆనంద నిలయం? 
హీరో వెంకటేశ్, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సినిమా రానుంది. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చిన బాబు) నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు చెందిన ఫొటోషూట్‌ కూడా జరిగింది. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెలలోనే ప్రారంభం కానుందని తెలిసింది. వెంకటేశ్‌ కెరీర్‌లోని ఈ 77వ సినిమా ప్రధాన కథాంశం వైజాగ్‌ నేపథ్యంలో సాగుతుందని, హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందించనున్నారని సమాచారం.

కాగా, ఈ సినిమా టైటిల్‌ ఇదంటూ పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ చిత్రానికి ‘ఆనంద నిలయం’, ‘వెంకట రమణ’, ‘వెంకటరమణ కేరాఫ్‌ ఆనంద నిలయం’ అనే టైటిల్స్‌ పరిశీలనలో ఉన్నట్లుగా ఫిల్మ్‌నగర్‌ సమాచారం. కాగా, త్రివిక్రమ్‌ దర్శకత్వంలోని సినిమాల టైటిల్స్‌ ప్రధానంగా ‘అ ఆ’ అక్షరాలతోనే ప్రారంభం అవుతుంటాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ‘ఆనంద నిలయం’ అనే టైటిల్‌ తెరపైకి రావడం ఆసక్తికరమైన విషయం.

మరోవైపు వెంకటేశ్‌ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు ‘మల్లీశ్వరి’ ‘నువ్వు నాకు నచ్చావ్‌’ సినిమాలకు త్రివిక్రమ్‌ రైటర్‌గా పని చేశారు. ఇప్పుడు వెంకటేశ్‌ హీరోగా త్రివిక్రమ్‌ సినిమా చేస్తున్న నేపథ్యంలో ఈ మూవీపై ఇటు ఇండస్ట్రీలో అటు ఆడియన్స్‌లో అంచనాలు ఉండటం సహజం. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను రిలీజ్‌ చేయాలని మేకర్స్‌  ప్లాన్‌ చేస్తున్నారని తెలిసింది.

భర్త మహాశయులకు విజ్ఞప్తి
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి, రోల్‌ మోడల్, అనార్కలి’... ఇప్పటివరకు రవితేజ 76వ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న టైటిల్స్‌ ఇవి. ఈ ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్టైన్‌మెంట్‌ సినిమాను కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ స్పెయిన్‌లో జరుగుతోంది. కొంత టాకీ  పార్టుతో  పాటు  పాటలను కూడా చిత్రీకరిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.

పైగా, ఈ మూవీని వచ్చే సంక్రాంతికే విడుదల చేస్తామని మేకర్స్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్‌ను అతి త్వరలోనే మేకర్స్‌ అధికారికంగా ప్రకటిస్తారని ఊహించవచ్చు. మరి... ప్రచారంలో ఉన్న టైటిల్స్‌లో ఏదో ఒకటి రవితేజ 76వ సినిమాకు ఫిక్స్‌ అవుతుందా? లేక మరో టైటిల్‌ ఏదైనా తెరపైకి వస్తుందా? అనేది చూడాలి.

వారణాసి
హీరో మహేశ్‌బాబు–దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంకా  చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఇతర ప్రధాన  పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ అనే వర్కింగ్‌ టైటిల్‌ ఉంది. అయితే ‘రాజకుమారుడు’, ‘జెన్‌ 63’ వంటి టైటిల్స్‌ తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

ఈ భారీ బడ్జెట్‌ సినిమా కోసం దాదాపు రూ. 50 కోట్లతో చిత్రయూనిట్‌ హైదరాబాద్‌ శివార్లలో ‘వారణాసి’ సినిమా సెట్స్‌ వేయడం, ఈ సినిమాకు కాశీ బ్యాక్‌డ్రాప్‌ ఉంటుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ‘వారణాసి’ అనే టైటిల్‌ తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. కాగా, నవంబరు నెలలో ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ సినిమా అప్‌డేట్‌ను విడుదల చేస్తామని ఇటీవల రాజమౌళి అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవంబరులో ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌నే అని, ఫస్ట్‌ లుక్‌ కూడా రిలీజ్‌ కావొచ్చని, ఇందుకోసం నవంబరు రెండో వారంలో ఓ పెద్ద ఈవెంట్‌ను రాజమౌళి అండ్‌ టీమ్‌  ప్లాన్‌ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

ప్రస్తుతం ‘బాహుబలి: ది ఎపిక్‌’ సినిమా పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనుల్లో ఉన్నారు రాజమౌళి. ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. దీంతో నవంబరులో మళ్లీ ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ సినిమాపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టనున్నారు రాజమౌళి. నవంబరులో మహేశ్‌బాబు, ప్రియాంకా  చోప్రాలపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని, ఓ  పాట చిత్రీకరణ కూడా ఉంటుందని, డిసెంబరులో చిత్రయూనిట్‌ కెన్యాకు వెళ్లనుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ఫౌజి... బ్రహ్మరాక్షస
ప్రభాస్‌ ప్రస్తుతం ‘ది రాజాసాబ్‌’ సినిమా సెట్స్‌లో ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ యూరప్‌లో జరుగుతోంది. సాంగ్స్‌ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాతో  పాటు దర్శకుడు హను రాఘవపూడితో ప్రభాస్‌ ఓ పీరియాడికల్‌ యాక్షన్‌ సినిమా చేస్తున్నారు. ఇందులో ఇమాన్వీ ఇస్మాయిల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, మిథున్‌ చక్రవర్తి, జయప్రద, అనుపమ్‌ ఖేర్‌ ఇతర ప్రధాన  పాత్రలు చేస్తున్నారు. ‘ప్రభాస్‌హను’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.

కాగా, ఈ సినిమాకు మేకర్స్‌ ‘ఫౌజి’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని, త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ రానుందని, వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయిని తెలిసింది. వచ్చే ఏడాది సెకండాఫ్‌లో ఈ సినిమా థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. అలాగే దర్శకుడు ప్రశాంత్‌ వర్మతో హీరో ప్రభాస్‌ ఓ సినిమా చేస్తున్నారని, ఈ సినిమాకు ‘బ్రహ్మరాక్షస’ అనే టైటిల్‌ను మేకర్స్‌ పరిశీలిస్తున్నారనే టాక్‌ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.

డ్రాగన్‌

హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కలిసి ఓ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా సినిమా చేస్తున్నారు. ‘ఎన్టీఆర్‌నీల్‌’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కన్నడ దర్శక– నటుడు రిషబ్‌ శెట్టి, మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఇతర ప్రధాన  పాత్రల్లో నటిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణకు చిన్న బ్రేక్‌ పడింది. ఓ యాడ్‌ షూటింగ్‌లో ఎన్టీఆర్‌ గాయపడ్డారు. ఎన్టీఆర్‌ పూర్తిగా కోలుకున్న తర్వాత ఈ సినిమా కొత్త షూటింగ్‌ షెడ్యూల్‌ ప్రారంభం అవుతుంది.

నెక్ట్స్‌ షూటింగ్‌ షెడ్యూల్‌ విదేశాల్లో జరుగుతుందని, ముందుగా యూకేలో  ప్లాన్‌ చేశారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. కాగా, ఈ సినిమాకు ‘డ్రాగన్‌’ అనే టైటిల్‌ను మేకర్స్‌ పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా షూటింగ్‌ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తారట.  కల్యాణ్‌రామ్, నవీన్‌ ఎర్నేని, వై. రవి శంకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్‌ 25న విడుదల కానుంది.

బ్లడీ రోమియో!
సిల్వర్‌ స్క్రీన్‌పై నాని ఓ రోమియోగా కనిపించనున్నారట. నాని హీరోగా సుజిత్‌ డైరెక్షన్‌లో ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం రానుంది. ఇందులో ప్రియాంకా మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ దసరా సందర్భంగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ సినిమాకు ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్‌ను మేకర్స్‌ పరిశీలిస్తున్నారని తెలిసింది.

లవ్, యాక్షన్‌ ప్రధానాంశాలుగా ఈ చిత్రం కొనసాగుతుందట. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ఈ టైటిల్‌ అయితే బాగుంటుందని మేకర్స్‌ అనుకుంటున్నారని తెలిసింది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్, యునానిమస్‌ ప్రోడక్షన్స్‌ పతాకాలపై నాని, వెంకట్‌ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది. అలాగే సుజిత్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా తెరకెక్కనుందనే టాక్‌ వినిపిస్తోంది.

కొరియన్‌ కనకరాజు? 
సిల్వర్‌ స్క్రీన్‌పై వరుణ్‌ తేజ్‌ దెయ్యాలను ఎలా అదుపు చేస్తారనే విషయం వచ్చే ఏడాది వెండితెరపై చూడొచ్చు. వరుణ్‌ తేజ్‌ హీరోగా మేర్ల పాక గాంధీ దర్శకత్వంలో ఓ హారర్‌ కామెడీ చిత్రం రూ పొందుతోంది. ఈ చిత్రంలో హాస్యనటుడు సత్య ఓ కీ రోల్‌ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. కాగా, ఈ సినిమాకు ‘కొరియన్‌ కనకరాజు’ అనే టైటిల్‌ను మేకర్స్‌ పరిశీలిస్తున్నారని, త్వరలోనే ఈ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించే చాన్సెస్‌ ఉన్నాయని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా.

స్లమ్‌ డాగ్‌
విజయ్‌ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘పూరీ సేతుపతి’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఓ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తుండగా టబు, దునియా విజయ్‌ ఇతర కీలక  పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో బెగ్గర్‌గా విజయ్‌ సేతుపతి, విలన్‌గా టబు నటిస్తున్నారని తెలిసింది.  వచ్చే వారం ఈ సినిమా కొత్త షూటింగ్‌ షెడ్యూల్‌ ప్రారంభం కానుంది.

ఈ సెప్టెంబరు 28న పూరి జగన్నాథ్‌ బర్త్‌ డే. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అధికారంగా ప్రకటించాలనుకున్నారు మేకర్స్‌. కానీ తమిళనాడులో జరిగిన కరూర్‌ దుర్ఘటన కారణంగా టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ను క్యాన్సిల్‌ చేశారు మేకర్స్‌. అయితే ఈ సినిమాకు ‘స్లమ్‌ డాగ్, బెగ్గర్, భవతీ భిక్షాందేహి’ అనే టైటిల్స్‌ను పరిశీలించారట. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. పూరి జగన్నాథ్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా, చార్మి కౌర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు హర్షవర్థన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తారు. 

ఇలా రెండు, మూడు టైటిల్స్‌ను పరిశీలిస్తూ, త్వరలోనే ఓ టైటిల్‌ను ప్రకటించనున్న మరికొన్ని సినిమాలు ఉన్నాయి.

‘చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా... చూస్తావా నా మైనా’... ఈ  పాట వినగానే, ‘ఏప్రిల్‌ 1 విడుదల’ సినిమా గుర్తుకు వస్తుంది. కానీ ‘చుక్కలు తెమ్మన్నా... తెంచుకురానా..’ అనే టైటిల్‌తో ఓ ఉమెన్‌ సెంట్రిక్‌ సినిమా రానుందని, వైజయంతీ మూవీస్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. అలాగే ఈ ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌లోని ప్రధాన  పాత్ర పోషించేందుకు భాగ్యశ్రీ భోర్సే, శ్రీలీల వంటి వార్ల పేర్లను పరిశీలిస్తున్నారట మేకర్స్‌. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. – ముసిమి శివాంజనేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement