
2023లో మొత్తం 30,604 కేసుల నమోదు
స్పష్టం చేస్తున్న ఎన్సీఆర్బీ–2023 గణాంకాలు
కేసు.. నో క్లూస్.. అందుకే క్లోజ్.. ఇదీ చాలా కేసుల పరిస్థితి. నేరం జరిగిందనే విషయం బాధితులతోపాటు పోలీసులకూ స్పష్టంగా తెలుస్తోంది. అయితే నిందితులను పట్టుకోవడానికి, వారిపై న్యాయస్థానంలో నేరం నిరూపించడానికి పక్కా ఆధారాలు మాత్రం లభించలేదు. ఈ కారణంగా కేసును మూసివేసినట్లు పోలీసుల ద్వారా బాధితుడికి సమాచారం వెళ్తుంది. అప్పుడు బాధితుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించడం... సరిగ్గా ఇలాంటి ఫీలింగ్‌నే 2023లో నగరానికి చెందిన 34.98 శాతం మంది బాధితులు అనుభవించారు.
- సాక్షి, సిటీబ్యూరో
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) 2023కు సంబంధించిన ‘క్రైమ్ ఇన్ ఇండియా’గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీన్నే సాంకేతిక పరిభాషలో ‘ట్రూ బట్ ఇన్ సఫీషియంట్ ఎవిడెన్స్/అన్ ట్రేస్డ్/నో క్లూ’అంటూ కేసును మూసేస్తున్నట్లు పేర్కొంటారు.
ఆర్థిక నేరాల్లోనే అత్యధికం...
హైదరాబాద్ నగర పోలీసు (Hyderabad Police) విభాగం 2023లో దర్యాప్తు చేసిన కేసుల్లో కొన్ని పాత కేసులూ ఉంటాయి. సరాసరిన చూస్తే 2023లో ఐపీసీ, లోకల్ యాక్ట్స్, ఐటీ చట్టాల కింద మొత్తం 30,604 కేసులు నమోదు కాగా.. వీటిలో 10,706 కేసుల్ని పైన చెప్పిన ‘నో క్లూ’కారణాలతో మూతపడ్డాయి. ఇలా మూతపడిన కేసుల్లో అత్యధికం ఐపీసీ చట్టాల కింద నమోదైన నేరాలకు సంబంధించినవే ఉన్నాయి. కేసులు ఇలా మూతపడటంలో బాధితుల పాత్ర సైతం ఉంటోందని పోలీసులు చెప్తున్నారు. బాధితులుగా మారిన వెంటనే పోలీసుల్ని ఆశ్రయించి కేసు నమోదు చేయిస్తుంటారని, ఆ తర్వాత కొన్నాళ్ళకు నిందితులు రాజీకి వస్తే అంగీకరిస్తారని అధికారులు పేర్కొంటున్నారు.
కేసు దర్యాప్తు, విచారణ వంటివి జాప్యాలుగా భావిస్తున్న బాధితులు తక్షణం నష్టం పూడుతోందనే ఉద్దేశంలో ఇలా చేస్తుంటారని వివరిస్తున్నారు. ఫలితంగా దర్యాప్తునకు అవసరమైన సాక్ష్యాధారాలను పోలీసులకు పూర్తిస్థాయిలో అందించరు. దీంతో ఈ తరహా కేసుల్ని ‘ట్రూ బట్ ఇన్‌సఫీషియంట్ ఎవిడెన్స్’ తదితర కారణాల కింద మూసేయాల్సి వస్తోందని పేర్కొంటున్నారు.
సాక్ష్యాధారాలు ఉండాల్సిందే...
ఏదైనా నేరానికి సంబంధించిన కేసును దర్యాప్తు చేసి, నిందితుల్ని అరెస్టు చేయడానికి ప్రాథమిక ఆధారాలు ఉంటే సరిపోతుంది. అయితే దర్యాప్తు పూర్తియిన తర్వాత పోలీసులు కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సదరు కేసు విచారణను న్యాయస్థానం చేపడుతుంది. దీనికి పక్కా సాక్ష్యాధారాలు ఉండాల్సిందే. అలా లేని పక్షంలో కోర్టు నుంచి పోలీసులకు అక్షింతలు తప్పవు. అవకతవకలకు, వేధింపులకు ఆస్కారం లేకుండా, బెదిరింపులు, ప్రలోభాలకు తావు లేకుండా ఉండటంతోపాటు నిరపరాధులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రతి కేసులోనూ సరైన సాక్ష్యాధారాలు సేకరించడానికి పోలీసులు ప్రయత్నిస్తుంటారు. పక్కా ఆధారాలు లేనప్పుడు పోలీసులు న్యాయనిపుణుల సలహా మేరకు ‘ట్రూ బట్ ఇన్‌సఫీషియంట్ ఎవిడెన్స్’లేదా ‘అన్ ట్రేస్డ్’లేదా ‘నో క్లూ’కారణంగా కేసుల్ని మూసేస్తుంటారు.
మరికొన్ని కారణాలతోనూ...
దర్యాప్తు చేస్తున్న కేసుల్ని మరికొన్ని కారణాలతోనూ పోలీసులు మూసేస్తున్నట్లు ఎన్సీఆర్బీ (NCRB) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి ఏడాది నగర పోలీసు విభాగానికి వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని తప్పుడు ఫిర్యాదులుగా తేలుతున్నాయి. వ్యక్తిగత, ఆర్థిక కారణాలు, ఈర్షా్యద్వేషాలు, అహం కారణంగా ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడానికి అకారణంగా ఆరోపణలు చేస్తూ పోలీసుల వద్దకు తీసుకువస్తున్నారని స్పష్టమవుతోంది.

దర్యాప్తులో అవి తప్పుడు ఫిర్యాదులని తేలడంతో ‘పాల్స్’ అనే కారణంగా కేసులు మూతపడుతున్నాయి. ‘ఆ తరహా నేరం కాని’కేసులూ మూతపడుతున్నాయి. కేసు నమోదు సందర్భంలో ఆ నేరం ఫలానా తరహాకు చెందినది భావిస్తున్నారు. చివరకు దర్యాప్తు పూర్తయ్యే సరికి దాని స్వరూప స్వభావాలు మారిపోవడంతోపాటు బాధితుల నుంచి సహకారం లేకపోవడంతో కేసు మూసేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.
నగదు లావాదేవీలతో ఇబ్బంది...
ఏటా నమోదవుతున్న ఆర్థిక నేరాల్లో నగదు లావాదేవీలకు సంబంధించినవి అనేకం ఉంటున్నాయి. రూ.2 లక్షలకు మించి నగదు రూపంలో లావాదేవీలు చేయకూడదని నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పటికీ రూ.లక్షలు, రూ.కోట్లలో ఈ లావాదేవీలు జరుగుతుంటాయి. పెట్టుబడులు, చిట్టీలు, భాగస్వామ్యం కోసం వెచ్చింపు, రుణాలు ఇప్పిస్తానంటూ కమీషన్లు... ఇలా అనేక చోట్ల నగదు లావాదేవీలే నడుస్తున్నాయి.
చదవండి: నీ చొక్కా చాలా బాగుంది.. నాకు ఇవ్వన్నా..
ఆద్యంతం ఇవన్నీ సజావుగా జరిగిపోతే అవి రికార్డుల్లోకి ఎక్కవు. ఎప్పుడైనా తేడా వచ్చినప్పుడు బాధితులుగా మారిన వాళ్లు పోలీసుల వద్దకు వస్తున్నారు. ఆన్‌లైన్ లేదా చెక్కుల రూపంలో జరిగిన వాటికి పక్కా ఆధారాలు ఉంటాయి. నగదు రూపంలో చేసిన లావాదేవీలను నిరూపించడం చాలా అరుదు. ఈ కారణంగానూ కొన్ని కేసులు ‘ట్రూ బట్...’ అంటూ మూసేయాల్సి వస్తోందని పోలీసులు చెప్తున్నారు.
పోలీసుల నిర్లక్ష్యం అరుదు..
ఠాణాల్లో నమోదైన కేసులు ‘ట్రూ బట్ ఇన్ సఫీషియంట్ ఎవిడెన్స్’కింద మూతపడటానికి అనేక కారణాలు ఉంటున్నాయి. ఈ అంశంలో పోలీసుల నిర్లక్ష్యం అనేది అత్యంత అరుదు. బాధితులు ఫిర్యాదు చేయడంలో ఆలస్యం చేయడం ఓ ప్రధాన కారణం. దీనికితోడు అనుమానితులు, నిందితులపై వివరాలు చెప్పకపోవడం, సరైన ఆధారాలు అందించకపోవడంతో కేసులు మూతపడుతున్నాయి. సైబర్ నేరాల విషయంలో కేటుగాళ్లు వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, వనరుల లేమి కారణంగా ఆధారాలు లభించట్లేదు.
– నగర పోలీసు ఉన్నతాధికారి