
మాజీ కౌన్సిలర్‌కు ఎమ్మెల్యే బత్తుల నివాళి
మిర్యాలగూడ అర్బన్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నేత, 14వ వార్డు మాజీ కౌన్సిలర్ గంధం రామకృష్ణ సోమవారం గుండెపోటుతో మృతి చెందగా మంగళవారం అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియలకు హాజరైన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (Bathula Laxma Reddy).. తాను ధరించిన చొక్కాను రామకృష్ణ చితిపై ఉంచారు.
రామకృష్ణ బతికున్నప్పుడు.. తాను ధరించిన చొక్కాను చూసి ‘అన్నా.. నీ చొక్కా చాలా బాగుంది. నాకు ఇవ్వన్నా..’అని అంటుండేవాడని, తాను తప్పకుండా ఇస్తా.. అని చెప్పి.. ఇవ్వడం మరచిపోయేవాడినని ఎమ్మెల్యే కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం తన చొక్కాను తీసి చితిపై ఉంచి.. రామకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు.
చదవండి: తెలంగాణలో రెండు దగ్గు మందులపై నిషేధం
నల్లగొండ పట్టణంలో దారుణం
నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ చదివే ఓ విద్యార్థినిపై ప్రేమ పేరుతో ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలంలోని అన్నారెడ్డిగూడెం గ్రామానికి (Annareddygudem Village) చెందిన బాలిక(17) నల్లగొండలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదే మండలం గుట్టకింద అన్నారం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గడ్డం కృష్ణతో ఆ విద్యార్థినికి ఆరు నెలలుగా పరిచయం ఉంది.
'మంగళవారం ఉదయం కళాశాలకు బయల్దేరిన ఆ విద్యార్థినికి.. ప్రేమ పేరుతో కృష్ణ మాయమాటలు చెప్పి నల్లగొండలోని తన స్నేహితుడి రూమ్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడు. అనంతరం అతనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్టు తెలిసింది. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కృష్ణకు అతడి స్నేహితుడు సహకరించాడని బాలిక తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు నిందితుడిపై అత్యాచారం, హత్య కేసులతోపాటు పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు ఎస్‌ఐ సైదులు తెలిపారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ పరిశీలించారు.