
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు దగ్గు మందులపై నిషేధం విధిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిలీఫ్, రెస్పిఫ్రెష్ టీఆర్ కాఫ్ సిరప్‌లను బ్యాన్ చేసింది. ఈ రెండు దగ్గు మందుల్లోనూ కల్తీ జరిగినట్లు వైద్య అధికారులు గుర్తించారు. దగ్గు మందు వాడకంపై ఇప్పటికే ప్రజారోగ్య విభాగం ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది.
కాగా, రెండేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారులకు దగ్గు, జలుబు మందులను సూచించవద్దని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఒక అడ్వైజరీ జారీ చేసిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో దగ్గు సిరప్ తాగి 11 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్‌ఎస్) స్పందించింది. చిన్నారులకు దగ్గు సిరప్ సిఫారసు చేసే విషయంలో వైద్యులు జాగ్రత్తగా ఉండాలని కోరింది.
సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లలకు దగ్గు సిరప్‌లను సిఫారసు చేయవద్దని కోరింది. ఆపై వయస్సుండే చిన్నారులకు కూడా సరైన మోతాదు, నిర్ణీత కాలావధి, వైద్యుల సరైన పర్యవేక్షణ వంటి అంశాల ఆధారంగానే ప్రిస్క్రైబ్ చేయాలంది. అదేవిధంగా, వైద్యుల సలహాలను తీసుకోకుండా యథేచ్ఛగా దగ్గు సిరప్‌ను వాడరాదని తల్లిదండ్రులను కోరింది.