ప్రయాణికుల్ని తన కారులో ఆస్పత్రికి తరలించిన హిందూపురం నివాసి
సాక్షి,కర్నూలు: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు గురువారం అర్ధరాత్రి తర్వాత కర్నూలు శివారులో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలి బూడిదైపోయింది. అత్యంత విషాదకరంగా 19 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో ఉన్న రమేష్ అనే వ్యక్తి తన తోటి ఆరుగురు ప్రయాణికుల్ని ప్రాణాలకు తెగించి కాపాడాడు.
ప్రమాద సమయంలో బస్సులో మంటలు చెలరేగి, చుట్టూ వ్యాపించాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ బస్సులో చిక్కుకుపోయారు. బయట నుంచి సహాయం అందించేందుకు వీలుకాలేదు. అప్పుడే నేనున్నాంటూ బస్సులో రమేష్ అనే ప్రయాణికుడు ప్రాణాలకు తెగించాడు. బస్సు అద్దం పగలగొట్టి తనతో పాటు మరో ఆరుగురిని బయటకు రప్పించాడు.
ఈ విషయాన్ని ప్రమాదం జరిగిన సమయంలో హిందూపురం నుంచి నంద్యాలకు వెళ్తున్న ప్రత్యక్ష సాక్షి మీడియాతో మాట్లాడారు.
ఆ సమయంలో నేను హిందూపురం నుంచి నంద్యాలకు నా కారులో వెళ్తున్నా. అద్దలు పగలగొట్టుకుని బయటకు వస్తున్న ఆరుగురు ప్రయాణికుల్ని నా కారులో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా. మంటలు వ్యాపిస్తుంటే బస్సు లోపల రమేష్ అనే వ్యక్తి అద్దాలు పగలగొట్టి ప్రయాణికుల ప్రాణాల్ని కాపాడారు. ఆస్పత్రికి చికిత్స పొందుతున్న రమేష్‌తో పాటు మిగిలిన ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు. బస్సు చుట్టూ మంటలు అంటుకున్నాయి. లోపలి నుంచి బయటకు వచ్చేందుకు.. బయట నుంచి బస్సు లోపలికి వెళ్లి ప్రయాణికుల్ని కాపాడేందుకు వీలు లేదు’ అని పేర్కొన్నారు.
సదరు హిందూపురం నివాసి సైతం ప్రమాదంలో గాయపడ్డ ప్రయాణికుల్ని సకాలంలో ఆస్పత్రికి తరలించారు. వైద్యం అందడంతో వారి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వ్యక్తి కూడా ప్రాణదాతగా నిలిచి ప్రశంసలందుకుంటున్నాడు. ఆరుగురి ప్రాణాలను కాపాడిన రమేష్ అనే ప్రయాణికుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


