జీతమో.. రామ‘చంద్ర’! | One Lakh Employees Waiting for Salaries in Andhra pradesh | Sakshi
Sakshi News home page

జీతమో.. రామ‘చంద్ర’!

Dec 9 2025 3:29 AM | Updated on Dec 9 2025 3:29 AM

One Lakh Employees Waiting for Salaries in Andhra pradesh

జీతాల కోసం లక్షమంది ఉద్యోగుల ఎదురుచూపు

18 శాఖల ఉద్యోగుల జీతాలు నేటికీ ఇవ్వని చంద్రబాబు సర్కారు 

8వ తేదీ వరకు జీతాలు ఇవ్వకపోతే ఎలాగంటూ ఉద్యోగులు ఆగ్రహం 

జీతాలను విడతల వారీగా చెల్లించే తంతుగా మార్చేసిన బాబు ప్రభుత్వం 

ఈ నెల 2న రూ.3 వేల కోట్లు అప్పు చేసినా ఇంకా వేతనాలు ఇవ్వలేదు 

ఒకటినే జీతాలు ఒక నెల ముచ్చటగానే మిగిల్చిన కూటమి  

సాక్షి, అమరావతి: ఒకరు కాదు.. వెయ్యి కాదు.. రా­ష్ట్రంలో ఏకంగా లక్ష మంది ఉద్యోగులు జీతాల కో­సం నిరీక్షిస్తున్నారు. ఒకటో తేదీ వెళ్లిపోయి ఇప్ప­టికే వారం దాటిపోయింది. అయినా చంద్రబాబు సర్కా­రు కనికరించడం లేదు. గతంలో సమస్యల పరిష్కా­రం.. ఆర్థిక ప్రయోజనాల కోసం ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేసేవి. ఇప్పుడు జీతాలు కోసం ధర్నా­లు చేసే పరిస్థితి వచ్చింది. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు అందుకుని ఎన్ని నెలలో అవుతోందని ఉద్యోగులు వాపోతున్నారు. 

8వ తేదీ వెళ్లినా..
రాష్ట్ర ప్రభుత్వంలోని 18 శాఖలతోపాటు జలవన­రులు, పంచాయతీరాజ్, ఆర్‌ అండ్‌ బీ, పబ్లిక్‌ హెల్త్‌ వంటి ఇంజనీరింగ్‌ విభాగాల్లోని సుమారు లక్ష మంది ఉద్యోగులకు ఈ నెల 8వ తేదీ వచ్చినా చంద్ర­బాబు సర్కారు జీతాలు ఇవ్వలేదు. ప్రభుత్వ ఉద్యో­గు­లకు, పెన్షనర్లకు ప్రతినెలా 1వ తేదీనే వేతనాలు, పెన్షన్లు చెల్లిస్తామంటూ ఎన్నికల ముందు ప్రగల్భా­లు పలికిన చంద్రబాబు ఆ హామీని నెరవేర్చడం లేదు. ఈ నెల 8వ తేదీ వచ్చినా పౌర సరఫరాలు, ప్రజారోగ్యం, చక్కెర–డైరెక్టరేట్, సర్వే విభాగం, వ్య­వసాయం, ప్రణాళిక, పరిశ్రమలు, సహకార, రవా­ణా, సమాచార, ఈఎస్‌ఐ, ఆర్‌ అండ్‌ బీ, గనులు­–భూగర్భ, ఎన్‌సీసీ, పశుసంవర్ధక, గిరిజన సంక్షేమ, బీసీ శాఖల్లో ఉద్యోగులకు జీతాలు అందకపోవడంతో వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

జగన్‌ హయాంలో ఇలా ఎదురుచూడలేదు
వైఎస్సార్‌సీపీ హయాంలోనే ఉద్యోగులకు వేతనాలు మెరుగ్గా వచ్చాయని, 8వ తేదీ వరకు వేతనాల కో­సం ఎదురు చూడలేదని ఉద్యోగులు స్పష్టం చేస్తు­న్నా­రు. గతంలోని చంద్రబాబు పాలనలో ఉద్యోగు­లపై ఎప్పుడూ సానుకూలత ఉండేది కాదని.. ఇప్పు­డు మళ్లీ అదే తరహాలో చంద్రబాబు వ్యవహరిస్తు­న్నారనే అభిప్రాయాన్ని ఉద్యోగులు వ్యక్తం చేస్తు­న్నారు. కొన్ని శాఖలకు ఈ నెల 3న వేతనాలు చెల్లించారని, 8వ తేదీ వచ్చినా 18 శాఖల్లో పనిచేసే ఉద్యో­గులకు వేతనాలు చెల్లించకపోవడం ఉద్యోగుల పట్ల వివక్ష చూపడం కాదా అని ఉద్యోగ వర్గాలు ప్రశ్ని­స్తున్నాయి. ఉద్యోగులను విభజించి కొంతమంది ఉద్యోగులకు ముందుగా.. మరికొందరికి ఆలస్యంగా జీతాలు చెల్లించడం చంద్రబాబు ప్రభుత్వంలోనే చూస్తున్నామని వాపోతున్నారు.

ఈఎంఐలు కట్టేందుకు ఇబ్బందులే..
జీతాలు అందకపోవడంతో పాలు పోసే వ్యక్తి నుంచి కిరాణా కొట్టులో బాకీ వరకు.. ప్రతి ఖర్చుకూ ఎలా సర్దుబాటు చేయాలో తెలియక ఉద్యోగులు, ఉపా­ధ్యాయులు మధనపడుతున్నారు. ఒకటో తేదీ జీతం వస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా­మంది రుణ వాయిదాలను ప్రతినెలా 5వ తేదీలోపే పెట్టుకున్నారు. సకాలంలో జీతాలు రాకపోవడంతో వాయిదాలకు వడ్డీ కింద ప్రతినెలా రూ.600 నుంచి రూ.1,500 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది.  మందులు కొనుక్కునేందుకు అప్పులు చేయాల్సి వస్తోందని పింఛనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోతే ఉద్యోగులను బ్యాంకులు డిఫాల్టర్లుగా చూస్తాయని, భవిష్యత్‌లో రుణాలు ఇవ్వడానికి ఇది మచ్చగా మిగులుతుందని ఆందోళన చెందుతున్నారు. 

రూ.3 వేల కోట్లు అప్పు తెచ్చి ఏం లాభం
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2న రూ.3 వేల కోట్లను అప్పు చేసినప్పటికీ 8వ తేదీన కూడా జీతాలు ఇవ్వకపోతే ఏం లాభమని, ఆ డబ్బంతా ఏమైందని ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. గత నెల వరకు ఉపాధ్యాయులకు  ఏ నెలలోనూ 1వ తేదీన జీతాలు ఇవ్వలేదు. ఉపాధ్యాయులు వేతనాల కోసం పలు­సా­­ర్లు రోడ్లెక్కాల్సి వచ్చింది. దీంతో ఈ నెల 3న ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించారు. రాష్ట్ర సచి­వాలయ ఉద్యోగులకు ముందుగా వేతనాలు చెల్లి­స్తూ.. మిగతా ఉద్యోగులకు విడతల వారీగా 10వ తేదీ వరకు చెల్లించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 

చిరుద్యోగులకూ ఎదురుచూపులే
చంద్రబాబు ప్రభుత్వంలో చిరుద్యోగులు వేతనాల కోసం ప్రతినెలా ఎదురు చూపులే మిగులుతు­న్నా­యి.  104 ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ లెక్చరర్లు, హోంగార్డులు, వీఆర్‌ఏలు, ఆరోగ్య మిత్రలు వేతనాల కోసం రోజుల తరబడి ఎదురుచూస్తూనే ఉన్నారు. వారంతా జీతాలు చెల్లించాలని ప్రతినెలా ప్రభు­త్వాన్ని అడుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది. 

డీఏ బకాయిల సంగతేమిటో మరి
2019 ఎన్నికల ముందు చంద్రబాబు ప్రభుత్వం డీ­ఏలకు పోస్టు డేటెడ్‌ జీవోలను జారీ చేసిందని ఉద్యో­గులు గుర్తు చేస్తున్నారు. డీఏలకు పోస్ట్‌ డేటెడ్‌ జీవో­లను జారీ చేసే ఆనవాయితీని చంద్రబాబు ప్రభు­త్వ­మే తీసుకువచ్చిందని, అప్పటివరకు ఏ ప్రభు­త్వం పోస్ట్‌ డేటెడ్‌ జీవోలు ఇవ్వలేదని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. వచ్చే జనవరితో కలిపి చూస్తే చంద్రబాబు ప్రభుత్వం 5 డీఏలు బకాయిలుంటే ఎట్టకేలకు ఒక డీఏను మంజూరు చే­సి ఆ బకాయి­లను మూడు వాయిదాల్లో చెల్లిస్తామని జీవోలో పేర్కొనడాన్ని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. 

ఈ హామీల సంగతేమిటో!
ఎన్నికల సందర్భంగా ఉద్యోగులకు చంద్రబాబు ఇచ్చిన హామీలను ఏడాదిన్నరైనా అమలు చేయకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. అధికారంలోకి రాగానే ఐఆర్‌ ఇస్తానని, పీఆర్‌సీ వేస్తానని, బకాయిలన్నీ వీలైనంత త్వరగా చెల్లిస్తానని, ఓపీ­ఎస్‌ను–జీపీఎస్‌ను సమీక్షించి మెరుగైన సీపీఎస్‌ విధానాన్ని తీసుకొస్తామని చంద్రబాబు హామీ ఇచ్చా­రు. ఏడాదిన్నరైనా ఉద్యోగులకు ఐఆర్‌ ప్రక­టిం­చలేదు. పీఆర్సీ వేయలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభు­త్వం ఎన్నికల ముందే పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేసి కమిషనర్‌ను కూడా నియమించింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే పీఆర్‌సీ కమిషన­ర్‌తో రాజీనామా చేయించారు. ఇప్పటికీ పీఆర్సీని ఏర్పాటు చేయకుండా.. కమిషనర్‌ నియ­మించకుండా కాలయాపన చేస్తున్నారు. మరోపక్క ఉద్యోగు­లకు రూ.31 వేల కోట్లు బకాయిలను చెల్లించకుండా వాయిదాలు వేస్తూ వస్తున్నారు.

జీతాలు రాక ఈఎంఐలు కట్టలేకపోతున్నారు
అప్పుడే ఎనిమిదో తేదీ వచ్చేసింది. ఇంతవరకు జీతాలు రాక చిరుద్యోగులు చాలా ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రతి నెలా మొదటి వారంలో ఈఎంఐలు చెల్లించాలి. అవి చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడు­తున్నారు. ప్రభుత్వం ప్రతి నెలా మొదటి వారమే జీతాలు విడుదల చేయాలి. – గుద్దటి రామ్మోహనరావు, అధ్యక్షుడు, ఏపీఎన్‌జీజీఓ, కాకినాడ

వేతన కష్టాలు మొదలయ్యాయి
ఉద్యోగులకు వేతన కష్టా­లు మొదల­య్యా­యి. దాదాపు అన్ని శాఖల్లో ఈ నెల ఇప్ప టి వరకు జీతాలు పడలేదు. 5వ తేదీలోగా వేతనం అందకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. లోన్‌ల ఈఎంఐలు ప్రతినెలా 5వ తేదీలోగా కచ్చి­తంగా కట్టాల్సి ఉంటుంది. – ఎన్‌.దివాకర్‌రావు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడు

ప్రభుత్వ ఉద్యోగులపై చిన్నచూపు తగదు
ప్రభుత్వ ఉద్యోగులతో సర్కారు ఆటలాడుకుంటోంది. వారిని చిన్నచూపు చూస్తోంది. సమయానికి జీతాలు వేయకపోతే ఉద్యోగుల జీవనం సాగేదెలా? ఇప్పటివరకు నాకు తెలిసి 15 డిపార్ట్‌మెంట్లకు జీతాలు పడలేదు. గతంలో 1వ తేదీనే జీతం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. 8వ తేదీ వచ్చినా జీతాలు జమ చేయకపోవడంతో ఉద్యోగుల కుటుంబాలు పస్తులుండాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే జీతాలను జమ చేయాలి. – గిరి కుమార్‌ రెడ్డి, ఏపీజేఏసీ మాజీ జిల్లా అధ్యక్షుడు, కర్నూలు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement