బీడీఎస్ సీట్ల ఖాళీలు ప్రకటించకుండానే భర్తీ
సాక్షి, అమరావతి: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియలో పారదర్శకతకు చంద్రబాబు ప్రభుత్వం పాతర వేసింది. బీడీఎస్ సీట్లు ఎన్ని ఖాళీగా ఉన్నాయో ప్రకటించకుండానే విద్యార్థులకు కేటాయింపు చేపట్టింది. మూడో విడత బీడీఎస్ కనీ్వనర్ సీట్ల కేటాయింపు ప్రొవిజనల్ లిస్ట్‌ను సోమవారం ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. వాస్తవానికి రెండో విడత కౌన్సెలింగ్‌లో విద్యార్థులు చేరని, వదులుకున్న సీట్ల వివరాలను తొలుత ప్రకటించాలి. ఇలా ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో విద్యార్థుల ముందుంచాకే తదుపరి కౌన్సెలింగ్‌లో సీట్లు కేటాయించాల్సి ఉంటుంది.
ఈ ఏడాది అక్టోబర్ 23న విశ్వవిద్యాలయం రెండో విడత కౌన్సెలింగ్‌లో సీట్లు కేటాయించింది. విద్యార్థులకు ఫ్రీ–ఎగ్జిట్ అవకాశం కల్పించింది. నవంబర్ 20తోనే దేశంలో మెడికల్ యూజీ ప్రవేశాల గడువు ముగిసింది. అయితే ఎంబీబీఎస్ ప్రవేశాలను తప్పుల తడకగా చేపట్టి వాటిని సరిదిద్దుకోవడంలోనే వర్సిటీ కాలయాపన చేసింది. దీంతో తుది దశ బీడీఎస్ కౌన్సెలింగ్ చేపట్టలేదని విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఇదిలా ఉండగా, రెండో దశ కౌన్సెలింగ్ ముగిసిన నెలన్నర అనంతరం నేరుగా మూడో దశ కౌన్సెలింగ్ ప్రొవిజనల్ సీట్ల కేటాయింపు జాబితాను సోమవారం వర్సిటీ విడుదల చేసింది. ఖాళీల వివరాలు ప్రకటించకుండా సీట్ల కేటాయింపు చేపట్టడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు అనుమానాలు, ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రొవిజనల్ సీట్ల కేటాయింపులో అభ్యంతరాలుంటే మంగళవారం మధ్యాహ్నం 2 గంటల్లోపు తెలియజేయడానికి అవకాశం ఇచ్చారు.


