ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు ఈ ఏడాది 1,566 నమోదయ్యాయని.. ఇందులో తొమ్మిది మంది బాధితులు మరణించారని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించారు. అయితే, ఈ మరణాలన్నీ స్క్రబ్ టైఫస్‌వల్లే జరిగినట్లు ఇప్పటివరకు నిర్ధారణ కాలేదన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తన కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్క్రబ్ టైఫస్ బాధితులు ఎందువల్ల మరణించారనే దానిపై పరిశోధన జరగాల్సి ఉందన్నారు. ఇందుకు కనీసం రెండు నెలల నుంచి మూడునెలల సమయం పట్టే అవకాశముందని తెలిపారు.
బాధితుల నుంచి సేకరించిన నమూనాలను జీనోమ్ స్వీకెన్సీ (గుంటూరు, తిరుపతి) ద్వారా పరీక్ష చేయించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. బోధనాసుపత్రుల్లో ఉండే ర్యాపిడ్ రెస్పాన్స్ టీం (ఆర్‌ఆర్)లు అధిక కేసులు/అసాధారణ మరణాలు నమోదైన ప్రాంతాల్లో పరిశోధన చేస్తాయన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఆర్‌ఆర్ టీంలు ఉన్నాయన్నారు. ఎలీశా పరీక్ష చేయించి, స్క్రబ్ టైఫస్‌పై అవగాహనకు వస్తామన్నారు. గుంటూరు జీజీహెచ్‌లో గడిచిన 38 రోజుల్లో 26 స్క్రబ్ టైఫస్ కేసులు వచ్చాయన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రఘునందన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మన్యంలో స్క్రబ్ టైఫస్ కేసు
చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ప్రభుత్వాస్పత్రిలో ఓ గిరిజనుడికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసు నమోదైనట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి తెలిపారు. చింతూరు మండలం కొత్తపల్లికి చెందిన మడివి లక్ష్మయ్య ఈనెల 4న అధికజ్వరం, ఒళ్లునొప్పులతో సీహెచ్‌సీకి రాగా, వైద్యులు అనుమానంతో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అతనికి స్క్రబ్ టైఫస్ బ్యాక్టీరియా పాజిటివ్‌గా తేలింది. లక్ష్మయ్యకు చికిత్సకు అందిస్తున్నామని అతని పరిస్థితి స్థిరంగా ఉందని కోటిరెడ్డి తెలిపారు. వ్యాధి నిర్ధారణకు సంబంధించిన కిట్లు, మందులు ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు.


