
ప్రపంచంలో ఇప్పుడు ఏడు వేలకు పైగా భాషలు మనుగడలో ఉన్నాయి. గడచిన శతాబ్ద కాలంలో దాదాపు రెండు వేల భాషలు పూర్తిగా కనుమరుగైపోయాయి. ఇప్పటికి మనుగడలో ఉన్న ఏడు వేలకు పైగా భాషల్లోనూ సుమారు మూడు వేల భాషలు ప్రమాదం అంచుల్లో ఉన్నాయి. అంటే,ఆయా భాషల కోసం పరిరక్షణ చర్యలు చేపట్టకుంటే, కొన ఊపిరితో ఉన్న ఆ భాషలు కూడా కనుమరుగైపోవడానికి ఎంతోకాలం పట్టదు. భాషలు కనుమరుగైపోవడానికి సవాలక్ష కారణాలు. ఆ కారణాలలో ముఖ్యమైనది ప్రభుత్వాల అణచివేత ధోరణి.
అల్పసంఖ్యాకులు మాట్లాడుకునే భాషలలో బోధనావకాశాలు కల్పించకుండా చేయడం వంటి బుద్ధితక్కువ చర్యలు భాషల ఉసురు తీస్తున్నాయి. ఒక భాష అంతరించిపోతే వాటిల్లే నష్టం ఏమిటో రాజకీయాల్లో మునిగితేలే పాలకులకు తెలియదు. ఒక భాష అంతరించిపోతే, కేవలం ఒక సమాచార మార్పిడి సాధనం మాత్రమే అంతరించిపోయినట్లు కాదు. ఒక భాష అంతరించిపోతే, దానితో పాటే ఆ భాష మాట్లాడే ప్రజల పరంపరాగతమైన పరిజ్ఞానం; వారి సాంస్కృతిక సంపద; వారి సంప్రదాయాలు; వారు చెప్పుకొనే కథలు; వారు పాడుకొనే పాటలు– ఇలా అన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి.
ప్రపంచంలోనే అత్యధిక భాషలు మనుగడలో ఉన్న దేశం పాపువా న్యూగినీ. ఈ దేశంలో ముప్పయి మూడు భాషా కుటుంబాలకు చెందిన ఎనిమిది వందలకు పైగా భాషలు మనుగడలో ఉన్నాయి. పాపువా న్యూగినీ అధికార భాషలు ఇంగ్లిష్ సహా నాలుగే అయినా, స్థానిక సమూహాలు మాట్లాడుకునే భాషలను అక్కడి రాజ్యాంగం గుర్తించిందే తప్ప వాటి మనుగడను దెబ్బతీసే చర్యలేవీ చేపట్టలేదు. చాలా దేశాల కంటే విస్తీర్ణంలోను, జనాభాలోను, ఆర్థిక సంపదలోను పాపువా న్యూగినీ చిన్న దేశమే అయినా, భాషా బాహుళ్యానికి భరోసా కల్పించడంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది.
పాపువా న్యూగినీ తర్వాత భాషా బాహుళ్యంలో మన దేశం రెండో స్థానంలో ఉంది. ‘ఎథ్నోలాగ్– లాంగ్వేజెస్ ఆఫ్ ద వరల్డ్’ జాబితా ప్రకారం మన దేశంలో నాలుగు వందల యాభై ఆరు భాషలు మనుగడలో ఉన్నాయి. వీటిలో పదివేల మందికి పైగా జనాభా మాట్లాడే భాషలు నూట ఇరవై రెండు ఉన్నాయి. పది లక్షల మందికి పైగా జనాభా మాట్లాడే భాషలు ముప్పయి ఉన్నాయి. మన రాజ్యాంగం ఇరవై రెండు భాషలను గుర్తించింది.
మన దేశంలో అనేక భాషా కుటుంబాలకు చెందిన భాషలున్నాయి. ప్రధానంగా ఉత్తరాదిలో ఇండో–ఆర్యన్ కుటుంబానికి చెందిన భాషలు మాట్లాడేవారి జనాభా ఎక్కువ. దక్షిణాదిలో ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన భాషలు మాట్లాడేవారి జనాభా ఎక్కువ. ఇండో–ఆర్యన్, ద్రవిడ భాషా కుటుంబాలే కాకుండా; ఆస్ట్రో ఆసియాటిక్, సైనో–టిబెటన్, తాయ్ కడాయ్, అండమాన్ తదితర భాషా కుటుంబాలకు చెందిన భాషలు కూడా ఉన్నాయి.
మన దేశంలో గడచిన యాభయ్యేళ్లలో రెండు వందల ఇరవై భాషలు అంతరించిపోయాయి. మరో నూట తొంభై ఏడు భాషలు ప్రమాదం అంచుల్లో ఉన్నాయని యూనెస్కో ప్రకటించింది. ప్రపంచీకరణ ఫలితంగా విపణికి అవసరమైన భాషల ప్రాబల్యం ప్రపంచ వ్యాప్తంగా చాలా భాషల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చింది. నియంతలు ఏలిన దేశాల్లో ఆధిపత్య భాషల బలవంతపు రుద్దుడు ఫలితంగా ఎన్నో భాషలు కనుమరుగయ్యాయి.
నాజీ నియంత హిట్లర్ ఏలుబడిలో జర్మన్‌ను బలవంతంగా జనాల మీద రుద్దే ప్రయత్నం జరిగింది. ఇప్పటికీ భారత్ సహా ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రజాస్వామ్యం ఉన్నా, పాలకుల రాజకీయ, ఆర్థిక ఆధిపత్య ధోరణుల కారణంగా అల్పసంఖ్యాకులు మాట్లాడుకునే భాషలకు ముప్పు వాటిల్లుతోంది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు నూటనలభైకి పైగా భాషా కుటుంబాలు ఉన్నాయి. వీటి నుంచి విడివడి వేలాది భాషలు ఏర్పడ్డాయి. కాలగమనంలో వాటిలో అంతరించినవి అంతరించగా, కొన్ని ఇంకా మిగిలి ఉన్నాయి. వాటిలో కొన్ని భాషలు మిగిలిన భాషల మీద పెత్తనం చలాయిస్తుంటే, మిగిలిన భాషలు మనుగడ కోసం పోరాటం సాగిస్తున్నాయి. ‘ఒక మనిషితో మనం అతడికి అర్థమయ్యే భాషలో మాట్లాడితే, అది అతడి మస్తిష్కానికి చేరుతుంది.
అతడి భాషలోనే మాట్లాడితే, అది అతడి హృదయానికి చేరుతుంది’ అని నెల్సన్ మండేలా అన్నారు. ఇదొక సామరస్య ప్రకటన. ‘ఒక సంస్కృతిని నాశనం చేయాలంటే, ముందుగా దాని భాషను, చరిత్రను చంపాలి’ అనేది జాత్యహంకార నియంతల విధానం. ఆధిపత్య ధోరణులు భాషారంగం సహా ఏ రంగంలో ఉన్నా, ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు. ఏడు రంగులు హరివిల్లు ప్రత్యేకత అయినట్లే, భాషా బాహుళ్యమే మన దేశ సాంస్కృతిక ప్రత్యేకత.
హరివిల్లుకు ఒకే రంగుపూసి, దాని వర్ణవైవిధ్యాన్ని రూపుమార్చాలని అనుకోవడం ఎంతటి వెర్రి ఆలోచనో, దేశంలోని భాషా బాహుళ్యానికి విఘాతం కలిగించే ప్రయత్నాలు చేయడం కూడా అంతటి వెర్రితనమే! భాషా బాహుళ్యంలోని వైవిధ్యాన్ని కాపాడుకోవడం, అల్పసంఖ్యాకుల భాషా సంస్కృతుల మనుగడకు భరోసాను ఇవ్వడం ప్రజాస్వామిక ప్రభుత్వాల బాధ్యత. దురదృష్టవశాత్తు మన దేశంలో భాషలకు కూడా రాజకీయాల చీడ సోకింది.
భాషల నడుమ ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి కనీస అవగాహన లేకుండా ఏ భాష మరే భాషకు పెద్దమ్మ అవుతుందో, మరే భాష ఇంకే భాషకు అమ్మమ్మ అవుతుందో ప్రవచనాలు చెబుతుండటం మన దౌర్భాగ్యం. ఇలాంటి ప్రవచనాల్లో వాడే భాష దద్దమ్మ భాష తప్ప మరేమీ కాదు.