అన్నంత పని చేయబోతున్న ట్రంప్‌?! | Who is Ilhan Omar What she Says About india Why Trump Wants Deport Her | Sakshi
Sakshi News home page

అన్నంత పని చేయబోతున్న ట్రంప్‌?!

Dec 1 2025 12:42 PM | Updated on Dec 1 2025 12:42 PM

Who is Ilhan Omar What she Says About india Why Trump Wants Deport Her

ఇల్హాన్‌ ఒమర్‌ను అమెరికా నుంచి వెళ్లగొడతారా? ఆమెను పంపించేయాల్సిందేనని అక్కడి ప్రజలు ఎందుకు డిమాండ్‌ చేస్తున్నారు?. ట్రంప్‌ చెబుతున్నట్లు ఆమె నిజంగానే ఇమ్మిగ్రేషన్‌ ఫ్రాడ్‌కు పాల్పడ్డారా? భారత్‌పై వ్యతిరేక వ్యాఖ్యలు ఆమె ఎందుకు చేయాల్సి వచ్చింది?.. అసలు ఇంతకీ ఇల్హాన్‌ ఒమర్‌ నేపథ్యం ఏంటి?.. 

అమెరికా చట్ట సభ్యురాలు, మిన్నెసోటా రాష్ట్రానికి చెందిన డెమోక్రాటిక్‌ ప్రతినిధి ఇల్హాన్‌ ఒమర్. తాజాగా ఆమె వివాహం,ఇమ్మిగ్రేషన్‌ విషయంలో మోసానికి పాలపడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా పౌరసత్వం కోసం సొంత సోదరుడినే వివాహం చేసుకున్నారని ప్రధాన ఆరోపణ. దీంతో పాటు ఆమె చేస్తున్న యాంటీ అమెరికా కామెంట్లకు అక్కడి ప్రజలు రగిలిపోతున్నారు. డీనేచురలైజ్‌ చేసి (పౌరసత్వం రద్దు చేసి) దేశం నుంచి వెల్లగొట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ట్రంప్‌ అలా అనేసరికి.. 
2009లో ఒమర్‌ అహ్మద్‌ నూర్‌ సయీద్‌ ఎల్మీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమె అక్రమంగా అమెరికాకు వలస వచ్చారని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపణలు గుప్పించారు. వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తిని ఆమె వివాహమాడారని.. కేవలం అమెరికాలో స్థిరపడేందుకు ఆమె మోసం చేశారని ట్రంప్‌ ఆరోపించారు. ఈ క్రమంలో ఆమెను అమెరికా నుంచి బయటకు పంపించేస్తామని వ్యాఖ్యానించారు. వలసల విషయంలో కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్న ట్రంప్‌ నోటి నుంచి ఈ వ్యాఖ్యలు రావడంతో సాధారణంగానే చర్చ పెద్దదైంది. 

ఈ ఆరోపణలను ఒమర్‌ ఖండించారు. ట్రంప్‌ వ్యాఖ్యలను ఇస్లామోఫోబిక్‌, రాజకీయ ప్రేరేపితమైనవిగా అభివర్ణించారామె. రాజకీయంగా తనను బలహీనపర్చేందుకు జరుగుతున్న దాడి అని అన్నారామె. అయితే.. 

గతంలోనూ..
ఇల్హాన్‌ ఒమర్‌పై ఈ ఆరోపణలు కొత్తవేం కావు. 2016లో సోమాలి-అమెరికన్‌ ఫోరమ్‌ ఒకటి ఈ అభియోగాన్ని తెరపైకి తెచ్చింది. 2018 కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలోనూ ఈ అంశంపై పెద్ద చర్చ నడిచింది. తీవ్ర అభియోగాల నేపథ్యంతో కొన్ని మీడియా సంస్థలు ఇన్వెస్టిగేషన జర్నలిజంతో వాస్తవాలను వెలుగులోకి తెచ్చే ప్రయతనం చేశాయి. 2019-20 మధ్య ఎఫ్‌బీఐ, హౌజ ఎథిక్స్‌ కమిటీ ఈ అభియోగాన్ని పరిశీలించి ఏం తేలకపోవడంతో కేసులు మూసివేశాయి కూడా. అయినా కూడా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఇటీవల ఈ ఆరోపణలను మళ్లీ ప్రస్తావించారు. దీంతో అమెరికా రాజకీయాల్లో ఇమ్మిగ్రేషన్‌ & పౌరసత్వంపై పెద్ద చర్చకు దారితీస్తోంది. 

వెళ్లగొట్టాల్సిందే..! 
ట్రంప్‌ వ్యాఖ్యల తర్వాత ఆమెను అమెరికా నుంచి పంపించాలనే డిమాండ్‌ తెరపైకి వచ్చింది. అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఉద్యమిస్తున్న మాగా కార్యకర్తలు, కన్జర్వేటివ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా కోరుతున్నారు.  ఈ విషయంలో గట్టిగా పట్టుబడుతున్నారు. ఆమె మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ను ఎక్స్‌ ఖాతాలో వైరల్‌ చేస్తూ.. సాగనంపాల్సిందేనంటూ పోస్టులు పెడుతున్నారు.

ఇల్హాన్‌ ఒమర్‌(43).. పుట్టింది సోమాలియాలో. ఆ దేశ అంతర్యుద్ధంతో 8 ఏళ్ల వయసులో కెన్యాకు చేరుకుని నాలుగేళ్లపాటు శరణార్థ శిబిరాల్లో గడిపింది. అక్కడి నుంచి అమెరికాకు చేరుకున్న ఆమె.. 2000 సంవత్సరంలో అమెరికా పౌరసత్వం పొందింది. 2018 నుంచి ఇప్పటిదాకా నాలుగుసార్లు ఆమె చట్టసభకు ఎన్నికయ్యారు. 

అది సాధ్యమేనా?
అమెరికా చట్టం ప్రకారం, నేచురలైజ్డ్‌ సిటిజన్‌ (పౌరసత్వం పొందిన వ్యక్తి)ను డీనేచురలైజ్‌ చేయవచ్చు, కానీ అది స్పష్టమైన, బలమైన ఆధారాలతో మాత్రమే సాధ్యం. డీనేచురలైజేషన్‌ జరిగితే, ఆ వ్యక్తి పర్మనెంట్‌ రెసిడెంట్‌ లేదంటే అక్రమ వలసదారుగా మారతారు. తర్వాతే డిపోర్టేషన్‌ జరుగుతుంది. ఈ మధ్యలో కోర్టు జోక్యాలతో ఏదైనా జరగొచ్చు. అయితే.. అమెరికా చరిత్రలో ఇప్పటిదాకా ఇలాంటి చర్యలు ప్రధానంగా యుద్ధ నేరస్తులు, ఉగ్రవాదులపై మాత్రమే జరిగాయి. ఒమర్‌పై వినిపిస్తున్న ఈ ఆరోపణలకు స్పష్టమైన ఆధారాలు(ఫోరెన్సిక్‌ సహా) లేకపోవడం వల్ల చట్టపరంగా చర్యలు తీసుకోవడం కష్టమే. 

భారత్‌కు ఎందుకు అంత కోపం
వివాదాలు ఆమెకు కొత్తేం కాదు. ఆమె బహిరంగంగా చేసిన పలు ప్రకటనలు తీ​‍వ్ర దుమారం రేపాయి. సోమాలియా నా సొంతం దేశం అంటూ అమెరికాను ఆమె కించపరిచేలా వ్యవహరించారనే విమర్శ ఒకటి బలంగా వినిపిస్తుంటుంది. అంతేకాదు.. గాజా సంక్షోభ సమయంలో ఇజ్రాయెల్‌, అమెరికాను ఉగ్ర గ్రూపులతో పోల్చారామె. అలాగే.. ఇల్హాన్‌ ఒమర్‌ గతంలో భారత వ్యతిరేక వైఖరితో వార్తల్లో నిలిచారు. 2022లో ఆమె పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌ (POK)ను సందర్శించి, స్థానిక నేతలతో సమావేశమయ్యారు. ఆ సమయంలో ఆమె భారతదేశంపై మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు చేశారు. న్యూఢిల్లీ ఈ పర్యటనను తీవ్రంగా ఖండించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement