వియన్నా / స్లోవేనియా: వారం రోజులుగా అదృశ్యమైన ఆస్ట్రియన్ బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ స్టెఫానీ పైపర్ (31) విగతజీవిగా కనిపించింది. స్లోవేనియన్ అడవిలో ఒక సూట్‌కేస్‌లో ఆమె మృతదేహం లభ్యమైంది. దీనికి ముందు స్టెఫానీ పైపర్ మాజీ ప్రియుడు తన నేరాన్ని అంగీకరించి, పోలీసులను స్టెఫానీ మృతదేహాన్ని దాచిన ప్రదేశానికి తీసుకెళ్లినట్లు ఆస్ట్రియన్ అధికారులు తెలిపారు.
పైపర్ కనిపించకుండా పోవడంతో కలకలం చెలరేగింది. క్రిస్మస్ పార్టీ తర్వాత స్నేహితులు ఆమెను చివరిసారిగా చూశారు. స్థానిక నివేదికల ప్రకారం పార్టీ ముగిశాక పైపర్ తన ఇంటికి చేరుకున్నట్లు స్నేహితులకు వాట్సాప్ సందేశం పంపింది. ఆ తర్వాత తన ఇంటి మెట్ల మార్గంలో ఎవరో తనను అనుసరిస్తున్నట్లు మరో సందేశాన్ని పంపింది. ఆస్ట్రియన్ వార్తాపత్రిక క్రోనెన్ జైటంగ్ నివేదిక ప్రకారం ఆమె మాజీ ప్రియుడు ఆమెను గొంతు కోసి చంపి, ఆపై మృతదేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కి అడవిలో పడేశాడని పోలీసుల ముందు వెల్లడించాడు. పీపుల్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం ఆమె అదృశ్యమైన రోజున ఆమె మాజీ ప్రియుడిని భవనంలో చూసినట్లు స్థానికులు తెలిపారు.
పైపర్ తప్పిపోయినట్లు ఫిర్యాదు అందిన వారం తర్వాత, ఆమె మాజీ ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్ట్రియన్ సరిహద్దు సమీపంలోని ఒక క్యాసినోలో అతని కారు మంటల్లో చిక్కుకున్న తరుణంలో పోలీసులు అతనిని పట్టుకున్నారు. అరెస్టు తర్వాత అతను నేరాన్ని అంగీకరిస్తూ, స్లోవేనియన్ అడవిలో మృతదేహాన్ని పడవేసిన ప్రదేశానికి పోలీసులను తీసుకెళ్లాడు. హత్యకు గల కారణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాజీ ప్రియుడితో పాటు, ఈ కేసులో అతని ఇద్దరు బంధువులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేరంలో వారి ప్రమేయంపై సమాచారం ఇంకా తెలియరాలేదు.
ఇది కూడా చదవండి: అణుశక్తి బిల్లు.. గేమ్ చేంజర్ అయ్యేనా?


