యువతి పేరిట సైబర్ నేరగాళ్ల మోసం
డాక్టర్ నుంచి రూ.14.61 కోట్లు లూటీ
సాక్షి, హైదరాబాద్: కల్లబొల్లి మాటలతో వల వేసి.. కలిసి పెట్టుబడి పెడితే మంచి లాభాలంటూ ఊదరగొట్టిన సైబర్ నేరగాళ్లు ఓ డాక్టర్ నుంచి 60 రోజుల వ్యవధిలో రూ.14.61 కోట్లు కొల్లగొట్టారు. సీఎంసీ మార్కెట్స్ ట్రేడింగ్ పేరుతో ఈ మోసానికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేసు నమోదు చేశారు. బ్యాంక్ లావాదేవీలు, ట్రేడింగ్ లింకుల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌కు చెందిన ప్రైవేట్ డాక్టర్ కె.మహేశ్వర్ రెడ్డికి ఆగస్టు 27న ఫేస్‌బుక్ మెసెంజర్‌లో మోనికా మాధవ్ పేరుతో ఫేస్‌బుక్ రిక్వెస్ట్ వచ్చింది. తను భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నానని తెలిపింది. విడాకుల కేసు కోర్టులో పెండింగ్ ఉందని నమ్మించింది. తనను తాను సీఎంసీ మార్కెట్స్ ట్రేడింగ్ ప్రతినిధిగా పరిచయం చేసుకుంది.
చాటింగులు, షేరింగులతో వల
వాట్సాప్, టెలిగ్రామ్‌లో చాటింగులు, షేరింగ్‌లు చేసింది. ఈ క్రమంలోనే సీఎంసీ ట్రేడ్ మార్కెట్‌లో రోజుకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు సంపాదిస్తున్నానని చెప్పింది. తనతో కలిసి ఇన్వెస్ట్ చేయాలని సూచించింది. ఇదంతా సైబర్ నేరగాళ్లు చేస్తున్న పని అని డాక్టర్ గుర్తించలేకపోయారు. విడతల వారీగా పెట్టిన పెట్టుబడికి పదింతలు లాభాలని ఫేక్ యాప్‌లో చూపుతూ ఈ నెల 26వ తేదీ వరకు 60 రోజుల వ్యవధిలో మొత్తం రూ.14.61కోట్లు డాక్టర్ నుంచి సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా విఫలమవడంతో తాను మోసపోయానని గుర్తించిన డాక్టర్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఆశ్రయించారు. టీజీ సీఎస్‌బీ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


