సమూల మార్పుతోనే నంబర్ వన్ స్థానానికి రాష్ట్ర విద్యావ్యవస్థ
‘తెలంగాణ ఉన్నత విద్య విజన్–2047’లో ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి
నేడు సీఎం వద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్
విద్యా ప్రమాణాలు మెరుగు పర్చేందుకు ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానించాలి
అంతర్జాతీయ సాంకేతికతకు అనుగుణంగా కోర్సులు రీ డిజైన్ చేయాలి
ఉన్నత విద్యా మండలి చైర్మన్ సూచన
రాష్ట్ర విద్యా రంగాన్ని దేశంలో నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్ళేందుకు విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. హైటెక్ హంగులతో, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సంస్కరణలు ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. డిసెంబర్‌లో జరగబోయే గ్లోబల్ సమ్మిట్‌ను దృష్టిలో ఉంచుకుని ‘తెలంగాణ ఉన్నత విద్య విజన్–2047’ డాక్యుమెంట్‌ను ఆయన రూపొందించారు. దీనిపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) క్రోడీకరణతో కూడిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను శనివారం ముఖ్యమంత్రి వద్ద ఉంచనున్నారు. ‘సాక్షి’కి ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చిన ఈ డాక్యుమెంట్‌లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
రూ.లక్ష కోట్ల పెట్టుబడి అవసరం
⇒ విద్యా రంగం ప్రమాణాలు మెరుగుపర్చడానికి 2047 నాటికి రూ.లక్ష కోట్లు అవసరం. ప్రస్తుతం ప్రభుత్వం సుమారు రూ.21 వేల కోట్లు ఇస్తోంది. వచ్చే 20 ఏళ్ళూ ప్రతీ ఏటా రూ.5 వేల కోట్ల చొప్పున రూ.లక్ష కోట్ల నిధులు సమకూర్చాలి. అయితే ఈ మొత్తం ప్రభుత్వమే సమకూర్చడం సాధ్యం కాదు కాబట్టి ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానించాలి.
⇒ నిధులను ఆధునిక మౌలిక సదు పాయాలు, డిజిటల్ ఎడ్యుకేషన్, అధ్యాపక శిక్షణ, పరిశోధన–ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ విద్య భాగస్వామ్యాలను విస్తరించేందుకు వినియోగించాలి. దీనివల్ల ఉన్నత విద్యలో సగటు ప్రవేశాల శాతం 38 నుంచి 20 ఏళ్ళల్లో 70 శాతానికి చేరే అవకాశం ఉంది.
⇒ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిటీకి 300 నుంచి 500 ఎకరాలు మొదటి దశలోనే కేటాయించాలి. పీపీపీ మోడల్‌లో బహుళ విశ్వవిద్యాలయ నగరం ఏర్పాటు, భవిష్యత్ అవసరాల కోసం దీనిని వెయ్యి ఎకరాల వరకూ విస్తరించాలి.
⇒ అంతర్జాతీయ పరిశోధన కేంద్రాలు, ఆవిష్కరణల హబ్‌లు, ఎడ్యూటెక్ కంపెనీలు, స్టార్టప్ యాక్సిలరేటర్లు అన్నీ ఒకే క్యాంపస్‌లో ఉండేలా చూడాలి.
నైపుణ్య శిక్షణ పెంచాలి
⇒ బీటెక్, డిగ్రీ, ఎంబీఏ ఇతర మేనేజ్ మెంట్, సాంకేతిక కోర్సులను రీ డిజైన్ చేయాలి. అంతర్జాతీయ సాంకేతికతకు అనుగుణంగా వీటిని మార్చుకోవాలి. బీటెక్ చేసినా 80 శాతం మంది నైపుణ్యం సమస్యను ఎదుర్కొంటున్నారు. మౌలిక వసతులు, చదుకునే సమయంలో మంచి నైపుణ్య శిక్షణ పెంచే పారిశ్రామిక భాగస్వామ్యంతో ఈ సమస్యకు చెక్ పెట్టాలి.
⇒ ఉద్యోగాలు సృష్టించే యువతను తయారు చేయాలంటే ముందుగా వారికి మౌలిక సదుపాయాలు, ఆధునిక టెక్నాలజీని సులభంగా అందుబాటులోకి తేవాలి. ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటులో ఈ తరహా ప్రయత్నాలు సాగాలి.
⇒ బోధన సిబ్బందికి మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. ఐటీ రంగంలో ఉన్నతులైన వారిని శిక్షణకు, బోధనకు ఉపయోగించుకునే సరికొత్త వ్యవస్థను సృష్టించాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వం విజయవంతం అయ్యేలా డాక్యుమెంట్
రాష్ట్రంలో వనరులున్నాయి. యువతలో చైతన్యం ఉంది. మారుతున్న సాంకేతికత అందుకుని, నైపుణ్యం పెంచుకోవడంలో మరింత కృషి జరగాలి. ప్రభుత్వమే వేల కోట్ల రూపాయలు వెచ్చించడం సాధ్యం కాదు. అందువల్ల పెట్టుబడులను ఆహ్వానించి, ప్రమాణాలు పెంచడం ద్వారా ప్రభుత్వం విజయవంతమయ్యే దిశగా విజన్–2047 డాక్యుమెంట్ తయారు చేశాం. – ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యా మండలి


