
ఇన్ బాక్స్
నాలుగు ద్రావిడ భాషల పదాలను సేకరించి ఒక భారీ నిఘంటువును రూపొందించిన కేరళ వాసి జత్యేల శ్రీధరన్ తలస్సేరిలో తన నివాసంలో ఈ నెల 13న కన్ను మూశారు. ప్రభుత్వాలు, విశ్వ విద్యాలయాలు చేపట్టవలసిన నాలుగు భాషల పదాల ఈ తుల నాత్మక అధ్యయనాన్ని ఆయన ఒంటరిగా సాధించారు. ‘చతుర్ ద్రావిడ భాష పద పరిచయం’ పేరిట ఈ నిఘంటువు మలయాళంలో ముద్రింపబడింది.
1934లో పేద కుటుంబంలో పుట్టిన శ్రీధరన్ నాల్గవ తరగతిలోనే చదువు వదిలేసి ఓ బీడీ కంపెనీలో పనికి కుదిరారు. బీడీ ప్యాకింగ్‌పై నాలుగు ద్రావిడ భాషల పదాలు ఉండేవి. ఒక మలయాళం పదాన్ని మిగతా మూడు భాషల్లో ఏమంటారో తెలుసుకోవాలన్న ఆసక్తి అక్కడే పుట్టి పెరిగింది. ఆ పని చేస్తూనే ఎనిమిదవ తరగతి పరీక్ష రాసి ఉత్తీర్ణుడై పీడబ్ల్యూడీ శాఖలో ఉద్యోగంలో చేరారు. తాను సేక రించిన మలయాళం పదాలకు తమిళ పదాలు తొందరగానే లభించేవి కానీ కన్నడ, తెలుగు పదాలు చెప్పేవారు దొరికేవారు కాదు. అందుకోసం తానే శ్రమించి తమిళ, కన్నడ, తెలుగు భాషలు నేర్చుకున్నారు. పుస్తకాల్లో దొరకని పదాల కోసం మూడు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించారు. ఇలా ఆయన అన్ని భాషల్లో కలిపి పన్నెండు లక్షల పదాలను సేకరించారు. 1972లో తొలి ప్రయత్నంగా ‘మలయాళం– తమిళ నిఘంటువు’ను తెచ్చారు. ఉద్యోగానికి వెళుతూ సేకరించిన నాలుగు భాషల పదాల కూర్పు కోసం 1984 నుండి పదేళ్ల పాటు శ్రమించారు. 1994 రిటైర్ అయ్యాక పూర్తి సమయాన్ని దీనికే కేటాయించారు.
ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!
ఈ నిఘంటువు నవంబర్ 2020లో పుస్తకంగా వచ్చింది. అప్పటికి ఆయనకు 82 ఏండ్లు. ముదిమి వయసులో లక్షలాది పదాల, వేయి పేజీల సమాచారాన్ని పట్టుకొని ప్రచురణ సంస్థల చుట్టూ తిరిగారు. పత్రికల ద్వారా ఈయన కృషిని తెలుసుకున్న కేరళ సీనియర్ సిటిజన్స్ ఫోరమ్ దీని ముద్రణ బాధ్యతలు తీసుకుంది. ఈ నాలుగు భాషల పదాల నిఘంటువులో ముందుగా మలయాళ పదం దాని అర్థం, తర్వాత సమాన అర్థం గల తమిళ, కన్నడ, తెలుగు పదాలు, వివరణలు నాలుగు కాలమ్స్‌గా ఒకే వరుసగా ఉంటాయి. జత్యేల శ్రీధరన్ నిఘంటువు విశేషాలతో దర్శకుడు నందన్2021లో ‘డ్రీమింగ్ ఆఫ్ వర్డ్స్’ అనే డాక్యుమెంటరీని రూపొందించారు. భాషలను రక్షించడం అందరి బాధ్యతనే సందేశాన్ని అందించిన శ్రీధరన్ జీవితం సదా స్మరణీయం.
– బద్రి నర్సన్, విశ్రాంత బ్యాంకు అధికారి