
పూర్వం ఒకప్పుడు గ్రీష్మ ఋతువు ఆగమనాన్నిగమనించిన పార్వతి, శివుడిని ‘స్వామీ! గ్రీష్మ ఋతువు వచ్చేసింది. వేడి వాతావరణం అంతటా నిండిపోయింది. తలదాచుకుందుకు ఇల్లు లేకుండా వేసవిలో రోజులు ఎలా గడపగలం?’ అని అడిగింది. దాక్షాయణి మాటలను విన్న శివుడు ‘దేవీ! మొదటి నుండీ మనది వనవాసమే కదా! ఇప్పుడు కొత్తగా ఈ కంగారేమిటి?’ అన్నాడు. శంకరుడు అలా మాట్లాడేసరికి సతీదేవి మరేమీ ఎదురు చెప్పలేకపోయింది. గ్రీష్మ ఋతువు ఎలాగో గడిచిపోయింది. వర్ష ఋతువు వచ్చింది. అన్ని దిక్కులా నల్లని మేఘాలు ఆవరించి అంధకారం అలుముకుంది. పార్వతి పతిని సమీపించి ‘మేఘాలు గర్జిస్తున్నాయి. కనులు మిరుమిట్లు గొలుపుతూ మెరుపులు మెరుస్తున్నాయి. ఆకాశం నుండి కురుస్తున్న వర్షధారలు నేలను తాకి శబ్దం చేస్తున్నాయి. నీటితో నిండుతున్న జలాశయాలపై కొంగలు పంక్తులుగా ఎగురుతున్నాయి. రివ్వున వీస్తున్న గాలుల తాకిడికి కదంబ, కేతకి, అర్జున వృక్షాలు పుష్పాలను రాలుస్తున్నాయి. మేఘాల గర్జనకు భీతిల్లిన హంసలు జలాశయాలను వదిలి పోతున్నాయి. ఇటువంటి దుస్సహమైన వాతావరణంలో స్వామివారు కరుణించి ఈ మహత్తరమైన మందరగిరిపై ఒక ఇంటిని నిర్మిస్తే నా దిగులు తీరుతుంది!’ అంది.
పార్వతి మాటలు విన్న ఫాలలోచనుడు ‘పార్వతీ! ఇల్లు నిర్మించుకుంటే బాగానే ఉంటుంది. కాని నా దగ్గర దానికి కావలసినంత ధనం లేదు. వ్యాఘ్రచర్మంతో శరీరాన్ని కప్పుకుని తిరిగేవాడిని నేను. సర్పములే నాకు భూషణములు కదా!’ అన్నాడు. ‘వేసవికాలంలో చెట్లనీడలలో కాలం గడిచి పోయింది. కానీ ఇప్పుడు, ఈ వర్షాకాలంలో అలా సాధ్యం కాదు కదా మహా దేవా!’ అని విన్నవించుకుంది పార్వతి. ‘మేఘమండలం పైకి చేరుకుంటే వర్షపు నీరు మీద పడి శరీరం తడిసే సమస్య ఉండదుగా దేవీ!’ అన్నాడు శంక రుడు పార్వతి విన్నపానికి సమాధానంగా!
తతో హరస్తద్ఘనఖణ్డమున్నత మారూహ్య తస్థౌ సహ దక్షకన్యయా
తతో భవన్నామ మహేశ్వరస్య జీమూతకేతుస్త్వితి విశ్రుతం దివి‘‘
అలా చెప్పిన శంకరుడు పార్వతి తోడుగా ఆకాశంలో మేఘమండలాల స్థాయిని దాటి పైకి వెళ్ళి అక్కడ ఉండిపోయాడు. అప్పటి నుండి దేవలోకంలో శంకరుడు ‘జీమూతకేతు’ అనే పేరుతో విశ్రుతుడై నిలిచాడని ‘వామన పురాణం’లోని పై శ్లోకం చెప్పింది.
– భట్టు వెంకటరావు