
తెలంగాణలోనే అత్యంత ఖరీదైన బతుకమ్మను పేర్చి కూకట్‌పల్లికి చెందిన పలువురు అబ్బురపరుస్తున్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన గుండాల అర్చన విదేశాల నుంచి పూలను తెప్పించి గత మూడేళ్లుగా వింతగా బతుకమ్మను పేరుస్తున్నారు.
మొదట తామర పువ్వు ఆకారంలోనూ, రెండో ఏడాది హంస ఆకారంలోనూ, ఈ ఏడాది ఏనుగు బొమ్మలతో కూడిన బతుకమ్మను పేర్చి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈసారి బతుకమ్మ కోసం థాయిలాండ్ ఆర్చిడ్స్, సింగపూర్ రోజెస్, బ్యాంకాక్ కాచెన్స్, బెంగళూరు బెజస్, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ నుంచి జిప్సోమియా పూలను తెప్పించినట్లు చెబుతున్నారు.
ఆకట్టుకున్న ‘భక్తి శక్తి’
నవరాత్రుల అర్థాన్ని బెంగళూరుకు చెందిన కూచిపూడి కళాకారులు నృత్యరూపకంలో ప్రదర్శించి ఆకట్టుకున్నారు. రవీంద్ర భారతిలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న సంగీత నృత్యోత్సవాలు– బతుకమ్మ సంబరాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు నాట్య గురువు వీణా మూర్తి విజయ్ శిష్య బృందం భక్తి శక్తి పేరిట ప్రదర్శించిన కూచిపూడి దృశ్యాంశాలు వీక్షకులను సమ్మోహన పరిచాయి.
పవిత్ర జలం, రంగోలి, ధూపం, దీపం, జాజ్రాలతో వేదికను శుద్ధి చేసే నృత్యం ఆసక్తికరంగా సాగింది. అదేవిధంగా నర్తకి శ్యామక్రిష్ణ, జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నవదుర్గ తోలుబొమ్మలాట ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్ డాక్టర్ అలేఖ్య
పుంజాల, ఆర్ వినోద్ కుమార్ పలువురు కళాకారులు పాల్గొన్నారు.
(చదవండి: విరామ భోగ్‘: అక్కడ నైవేద్యాన్ని అమ్మవారే స్వయంగా..!)