
‘దసరా అంటేనే మహిళల అపూర్వ శక్తికి పట్టం కట్టే అద్భుతమైన పండుగ. అందుకే ప్రతీ మహిళా ఈ పండుగతో మనసారా మమేకమవుతుంది’ అంటున్నారు ప్రముఖ సినీనటి అర్చన. దసరా పండుగ
నేపథ్యంలో ‘సాక్షి’తో తన మనోభావాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
నాకు అమ్మవారి పట్ల ఉన్న ఎనలేని భక్తి ఇప్పటిది కాదు. ముఖ్యంగా దుర్గామాత, సరస్వతీ దేవి రూపాలు అంటే చాలా ఇష్టం. సినిమాల్లో దేవీ పాత్రలు చేసిన అనుభవం ఉన్నప్పటికీ.. ఈ దసరా నాకెందుకు ప్రత్యేకం అంటే ప్రస్తుతం నేను చేస్తున్న కర్మస్థలం అనే సినిమా.
ఈ సినిమా కోసం నేను గతంలో ఎన్నడూ చేయని విధంగా అమ్మవారి ఉగ్రరూపం ధరించి తాండవం చేశాను. మహిషాసుర మరి్ధని మూర్తి ఎదురుగా చేసిన ఆ నాట్యం మరిచిపోలేని అనుభూతి అందించింది. మాతా తుల్జాభవాని తాకిన చీరను నాకు ఆ సన్నివేశంలో ధరింపజేశామని ఆ సినిమా యూనిట్ ఆ తర్వాత నాకు చెప్పారు.