
దేశవ్యాప్తంగా నాటక సమాజంలో దుర్గాదేవి పాత్రలో అనేక మంది ప్రాచుర్యం పొందారు. ముఖ్యంగా ‘మహిషాసుర మర్దిని’ నాటకంలో బుచ్చి లక్ష్మి చేసిన అభినయం, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అదేవిధంగా సురభి కమలాబాయి, సురభి రమణ వంటివారు దేవి శక్తిరూపాన్ని రంగస్థలంపై జీవంతో నింపారు. గ్రామీణ జాతర, యక్షగానం, బుర్రకథలు, హరిదాసు పాటల్లోనూ దుర్గమాత రూపాన్ని అనేక మంది మహిళలు అత్యంత భక్తితో ప్రదర్శించారు. సినీమాల్లోనూ పెద్ద హీరోయిన్లు అమ్మవారి పాత్రలను పోషించి పాత్రలో జీవించారు.
నాట్యకళల్లో (కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ) పలువురు మహిళా నర్తకీమణులు దుర్గమ్మ ప్రతిరూపాలుగా మెరిశారు. కూచిపూడిలో ‘మహిషాసుర మర్థిని’ తారంగములో దుర్గాదేవి ఆవిష్కరణ చేశారు. దేవి శక్తిరూపాన్ని శిల్పసుందరంగా, ఆధ్యాత్మికంగా ప్రదర్శించిన వారిలో శోభానాయుడు, అలేఖ్య పుంజల, యామిని కృష్ణమూర్తి తదితరులు ఎందరో దుర్గామాత శక్తి, వీరత్వాన్ని ఆవిష్కరించిన గొప్ప నర్తకీమణులుగా పేరొందారు.
వెండితెర ‘వేల్పులు’..
‘మాయాబజార్’ ‘చూడామణి’ ‘శకుంతల’ వంటి చిత్రాల్లో భక్తిపాత్రలు పోషించిన అంజలీదేవి దేవి, శక్తి రూపంలో కూడా తెరపై జీవించారు. అదేవిధంగా బి.సరోజాదేవి, జమున, కాంచనమాల పురాణ గాధా చిత్రాలలో దుర్గాదేవి పాత్రలు ధరించారు.
ఆ తర్వాతి తరంలో శ్రీవిద్య, జయసుధ, జయప్రద, రమ్యకృష్ణ, రాధ, భానుప్రియ వంటి హీరోయిన్లు అమ్మవారిలా భక్తుల మనసులు గెలుచుకున్నారు. సౌందర్య, మీనాక్షి శేషాద్రి కూడా నవరాత్రి, మహిషాసుర మర్దిని అంశాలతో రూపొందిన పాటలు, సన్నివేశాలలో శక్తిమాత రూపాన్ని ఆవిష్కరించారు.
అమ్మవారు పూనినట్టే..
సురభి కళాకారిణిగా పాతాళభైరవి అనే నాటకంలో అమ్మవారి పాత్ర పోషించడం మరుపురాని జ్ఞాపకం. ఆ పాత్ర అభినయం అయిపోయిన తర్వాత చాలాసేపు అదే భావనలో ఉండిపోయా.. అంతగా లీనమవ్వడం మరే పాత్రలోనూ జరిగేది కాదు.
– నిర్మల, సురభి నాట్యకళాకారిణి.
ఆ అనుభూతి సాటిలేనిది...
నర్తనశాల, భక్త ప్రహ్లాద, మహిషాసుర మర్దిని.. ఇలా ఎన్నో నాటకాల్లో అమ్మవారి పాత్రలు పోషించాను. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రదర్శనల్లో పాల్గొన్నాను. ముఖ్యంగా దేవీ నవరాత్రుల సమయంలో నా ప్రదర్శనలు ఎక్కువగా ఉంటాయి. దాదాపుగా 100కిపైగా నాటకాల్లో అమ్మ రూపాలను అభినయించాను. ఎన్నిసార్లు ఆ పాత్ర పోషించినా, తనివి తీరదు ఆ అనుభూతిని వర్ణించలేం.
– వెంగమాంబ, రంగస్థల నటి
(చదవండి: శ్రీ శారదాంబికా నమోస్తుతే!)