
భారతదేశంలో ఉన్న అపురూపమైన సరస్వతీ దేవి ఆలయాల్లో ఒకటి శృంగేరీ శారదాదేవి ఆలయం. కర్ణాటక రాష్ట్రంలో తుంగానదీ తీరంలో ఆదిశంకరులు స్థాపించిన దక్షిణామ్నాయపీఠం శృంగేరి. ఈ పీఠాధిష్ఠాత్రి కూడా ఆమే. శారదాదేవి ఇక్కడ నెలకొని ఉండటానికి ఒక వృత్తాంతం ఉంది. ఒక శాపవశాత్తూ బ్రహ్మా సరస్వతులిద్దరూ మండనమిశ్ర, ఉభయభారతులై భూమిపై జన్మించారు.
ఆదిశంకరులతో జరిగిన వాదంలో మండనమిశ్రులవారు ఓడిపోయి సన్యాసం స్వీకరించి సురేశ్వరాచార్యులనే పేరిట శృంగేరీ పీఠాధిపతిగా ఆదిశంకరులవారిచే నియమితులయ్యారు. ఉభయభారతీదేవి సాక్షాత్తు సరస్వతీస్వరూపమని తెలిసి ఉన్న శంకరులవారు ఆమెను అక్కడే కొలువై ఉండమని ప్రార్థించారు.
శంకరుల విన్నపంతో ఉభయభారతీదేవి శారదాదేవిగా శృంగేరీలో కొలువు తీరింది. నిజానికి ఈ అమ్మవారి మూలరూపం చందనవిగ్రహం. అయితే ఈ విగ్రహాన్ని విద్యాశంకరుల ఆలయంలో ప్రతిష్ఠించి, తరువాతి కాలంలో ఇక్కడ స్వర్ణవిగ్రహరూపంలో పూజలందుకుంటోంది. శారదాదేవి రూపం స్వస్తికాసనంలో కూర్చుని కుడిచేతితో చిన్ముద్ర (జ్ఞానముద్ర)ను చూపుతూ, ఎడమచేతిలో పుస్తకం ధరించి ఉంటుంది.
వెనుక కుడిచేత్తో జపమాలను, ఎడమచేత్తో అమృతకలశాన్ని ధరించి దర్శనమిస్తుంది. అమ్మవారికి వెనుక చిలుక కూడా ఉంటుంది. అఖండ విద్యాప్రదాయిని అయిన ఈ దేవి దర్శనంతో మనలోని అజ్ఞానపు మాలిన్యాలు తొలగి విజ్ఞానపు కాంతులు వెలుగొందుతాయి. చిన్ముద్ర, పుస్తకం, జపమాల, అమృత కలశం మొదలైనవన్నీ క్షయం లేనివనీ అవిద్యను రూపుమాపే విజ్ఞానపు సాధనాలనీ తెలుసుకోవాలి.
– డాక్టర్ ఛాయా కామాక్షీదేవి
(చదవండి: పైడితల్లికి ప్రణమిల్లి..!)