పైడితల్లికి ప్రణమిల్లి..! | Pydithalli Ammavari Sirimanotsavam Vizianagaram town AP | Sakshi
Sakshi News home page

పైడితల్లికి ప్రణమిల్లి..!

Oct 2 2025 10:10 AM | Updated on Oct 2 2025 10:10 AM

Pydithalli Ammavari Sirimanotsavam Vizianagaram town AP

విజయనగరం రైల్వేస్టేషన్‌కి సమీపం లో పైడిమాంబ అమ్మవారి ఆలయం వనంగుడి ఉంది. వనం అంటే అడవి కనుక దీన్ని వనంగుడి  అన్నారు.  దీన్ని అమ్మపుట్టినిల్లుగా భావిస్తారు.  ఊరి మధ్యలో ఉన్న చదురుగుడిని అమ్మవారి మెట్టినిల్లుగా పిలుస్తున్నారు. చదురుగుడిలో అమ్మవారికి ఇరువైపులా ఘటాలు (బిందెలు, కుండలు) ఉంటాయి.  వీటిలో నీటిని  అమ్మవారి తీర్ధంగా భక్తులు పుచ్చుకుంటారు.  ఈ గుడిలోనే రావి, వేప చెట్ల సంగమ వృక్షం ఉంది. దాని కిందనే అమ్మవారి సోదరుడిగా భావించే పోతురాజు పూజలందుకుంటున్నాడు.

అమ్మే దారి చూపిస్తుంది...
ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి కీలకమైన సిరిమాను చెట్టును పూజారికి పైడిమాంబ కలలో కనిపించి చూపిస్తుందని ఒక నమ్మకం. ఇది తప్పనిసరిగా చింతచెట్టు అయి ఉంటుంది. అమ్మ చూపిన దిక్కుగా వెతుక్కుంటూ వెళ్లిన పూజారి చెట్టును గుర్తించి భక్తులు, అధికారుల సమక్షంలో సేకరిస్తారు. ఈ ఏడాది సిరిమాను చెట్టు గంట్యాడ మండలం కొండతామరాపల్లి గ్రామంలో పైడితల్లి సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావుకు సాక్షాత్కరించింది. అదే గ్రామంలో ఇరుసుమానును గుర్తించారు. 

అత్యంత పవిత్రమైనదిగా భావించే ఈ చెట్లకు వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి విజయనగరం పట్టణంలోని హుకుంపేటకు తరలించారు. అక్కడ చెక్కి, నునుపైన మానుగా తీర్చిదిద్ది ఉత్సవానికి  సిద్దం చేస్తున్నారు. ఆలయం నుంచి కోట వరకూ సిరిమాను మూడుసార్లు తిరుగుతుంది. అనేక జానపద వేష ధారణలు సిరిమాను ముందు నడువగా, సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకుంటాయి.

సందడంతా తొలేళ్ల సంబరానిదే...
సిరిమానోత్సవం ముందురోజు రాత్రి చదురుగుడి వద్ద నుంచి అమ్మవారి ఘటాలను మేళతాళాలతో కోటలోనికి తీసుకువెళతారు.  కోటలో ఉన్న రౌండ్‌ మహల్‌ వద్దకు వెళ్లిన తర్వాత  పూజారికి బోనాలు వాళ్లు  అమ్మవారి చరిత్రను స్తుతిస్తూ రాగయుక్తంగా గానం చేస్తారు.  అక్కడ పూజల అనంతరం ఘటాలు చదురుగుడి వద్దకు తరలిస్తారు. ఆ గుడి ఎదురుగా ఒక బడ్డీని ఏర్పాటుచేసి అక్కడ ఘటాలను ఉంచుతారు.  

తెలంగాణా ప్రాంతంలో  అంగరంగ వైభవంగా జరిగే బోనాల ఉత్సవంలో వినిపించే భవిష్యవాణì  మాదిరిగానే ఇక్కడ కూడా పైడిమాంబ మాటగా పూజారి భవిష్యవాణిని వినిపిస్తారు.  అప్పటికే పూజారిపై ఆవహించిన పైడిమాంబ తన మాటగా భక్తులకు భవిష్యవాణి వివరిస్తుంది.రాబోయే ఏడాదికాలంలో జరిగే మంచి ,చెడులను అమ్మపలుకుతుంది.  పంటల విషయంలోనూ, పాడి సంపదల్లోనూ ఈ ప్రాంతం అభివృద్ది ఎలా ఉంటుందనేది కళ్లకు కట్టినట్లు  అమ్మ పలికిస్తుంది.  ఉపద్రవాలు వచ్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా సూచిస్తుంది. అందరికీ ఉపయోగపడే ఆ భవిష్యత్‌ వాణిని వినేందుకు  రైతులు అక్కడకుచేరుకుంటారు.  

ఆ తర్వాత పూజారి ధాన్యపు గింజలను రైతులకు అందజేస్తారు. వాటిని తమ పొలాల్లో  తొలివేరుగా విత్తుకుంటే ఆ ఏడాది పంటలు సమృద్ధిగా పండుతాయనేది రైతుల నమ్మకం. తొలేళ్ల ఉత్సవం సందర్భంగా వివిధ వేషధారణలతో పట్టణం కళకళలాడుతుంది. ఈ రాత్రంతా భక్తులు జాగారం మాదిరిగా పట్టణంలో కలియదిరుగుతారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన చిరు వ్యాపారులు వందలాది దుకాణాలు ఏర్పాటు చేస్తారు. రంగుల రాట్నం దగ్గర్నుంచి అనేక ఆట΄ాటలను అందుబాటులోకి తెస్తారు.

ఏటా విజయదశమి తర్వాతే సిరిమానోత్సవం...
పెద్దచెరువులో  ఆత్మార్పణ చేసుకున్న పైడిమాంబను విగ్రహరూపంలో చెరువు నుంచి బయటకు తీసి గుడిలో  ప్రతిష్టించినది విజయదశమి తర్వాత  వచ్చిన మంగళవారం రోజున అని ప్రతీతి.  అందుకే ప్రతీ ఏటా విజయదశమి వెళ్లిన తర్వాత వచ్చే తొలి మంగళవారం రోజున అమ్మవారికి సిరిమానోత్సవం నిర్వహిస్తారు. ఇలాంటి ఉత్సవం దేశంలో మరెక్కడా ఉండదు.  

దాదాపు 40 నుంచి 60 అడుగుల పొడవుండే సిరిమాను (చింతమాను)కు ఆసనం అమర్చి ఆ ఆసనంలో పూజారిని అమ్మవారి ప్రతిరూపంగా  కూర్చోబెట్టి  చదురుగుడి వద్ద ఉన్న ఆలయం నుంచి కోట వరకూ మూడుసార్లు ఊరేగిస్తారు. సిరిమాను ఊరేగింపు సాగినంత మేర భక్తులు పారవశ్యంతో అరటిపండ్లు, పూలు, ఇతర ప్రసాదాలను సిరిమాను మీదకు విసురుతూ  అమ్మదీవెనలు అందుకుంటారు. ఈ ఉత్సవానికి పూసపాటి వంశస్తులు తరలివచ్చి తమ ఇంటి ఆడపడుచుకు లాంఛనాలు సమర్పించుకుంటారు.

అద్భుతాలెన్నో....
సిరిమాను బయలుదేరుతుందనగా సిరిమానుకు ముందు అమ్మ విగ్రహాన్ని వెలికి తీసిన వలకు గుర్తుగా బెస్తవారి వలను నడిపిస్తారు. సంబరం ప్రారంభానికి ముందు  పలువురు ఈటెలను ధరించి పాలధారగా  అమ్మ ఆలయానికి చేరుకుంటారు.  అక్కడ నుంచి డప్పు వాయిద్యాలతో మహారాజ కోట పశ్చిమ భాగంవైపు వెళ్లి, కోటశక్తికి నమస్కరిస్తారు.  వీరంతా సైనికులుగా ఆ సమయంలో పనిచేస్తారు. సిరిమాను జాతరలో అంజలి రథానిది ఓ విలక్షణమైన స్థానం. సిరిమాను కు అంజలి ఘటిస్తూ  ముందుకు సాగే రథంపై ఐదుగురు పురుషులు స్త్రీల వేషాలను వేసుకుని కూర్చొంటారు. వీరంతా ఆరుమూరల నారచీరను, చేతికి వెండి ఆభరణాలను ధరించి  సంబరంలో పాల్గొంటారు. 

స్త్రీ వేషధారణలో ఉన్న వీరంతా అమ్మవారి పరిచారకులకు ప్రతీకలుగా వ్యవహరిస్తారు. వీరంతా అక్షింతలు పట్టుకుని సంబరం జరుగుతున్నంతసేపూ భక్తులపై విసురుతూ ఉంటారు.  దానికి ప్రతిగా భక్తులు భక్తిభావంతో అరటిపళ్లను వారిపై విసురుతూ ఉంటారు. స్థానిక ప్రజాప్రతినిధులతో ΄ాటు సిరిమానోత్సవానికి భక్తులు విశేషంగా తరలి వస్తారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా, కొలిచిన భక్తుల కొంగుబంగారమై ఉత్తరాంధ్ర ప్రజలను చల్లగా కాపాడుతోంది శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారు. విజయనగరంలో వెలిసిన ఆ తల్లి ఖ్యాతి రాష్ట్రాలు, ఖండాలు దాటి వ్యాపించింది. 

ఏటా నెలరోజుల పాటు నిర్వహించే పైడితల్లి అమ్మవారి జాతర ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రత్యేక పండగగా ప్రసిద్థి చెందింది. పండగే ఓ ప్రత్యేకతైతే ఆ పండుగలో సిరిమానోత్సవం నభూతో నభవిష్యత్‌ అనిపించేలా జరుగుతుంది. విజయనగరంలో అమ్మవారు వెలిసిన నాటి నుంచి ఇక్కడి ప్రజలు కష్టాలే ఎరుగలేదన్న విశ్వాసం గట్టిగా ఉంది. ఏ ఊరిని  తుఫాను ముంచెత్తినా, ఏ ఊళ్లో కల్లోలాలు జరిగినా విజయనగరం మాత్రం ప్రశాంతంగా ఉండటాన్ని అమ్మవారి అ΄ార కరుణకు నిదర్శనంగా ఇక్కడి ప్రజలు నమ్ముతుంటారు.

సిరిమానుకు దారిలా
పైడితల్లి అ్మమవారి కృపాకటాక్షాలు దక్కించుకోవడానికి హైదరాబాద్‌ నుంచి  విజయనగరానికి నేరుగా రైళ్ల ద్వారా  చేరుకోవచ్చు. దేశ, విదేశాల నుంచి విమానయానం ద్వారా రావాలనుకున్న వారు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి కేవలం గంటన్నర వ్యవధిలోనే విజయనగరం చేరుకోవచ్చు. అదేవిధంగా ఆర్టీసీ ద్వారా ప్రత్యేక సర్వీసులు నడుస్తున్నాయి. వీటితో పాటు ప్రైవేటు ట్రావెల్‌ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక పక్కనే ఉన్న ఒడిశా నుంచి ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వీరంతా వాహనాలు, రైళ్లు ద్వారా నేరుగా విజయనగరం చేరుకోవచ్చు.  

ఒడిశా ఆర్టీసీ బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి. విజయనగరం రైల్వేస్టేషన్‌లో అడుగు పెట్టగానే ఎదురుగా  పైడితల్లి అమ్మవారు వెలిసిన వనంగుడి  భక్తులకు కనబడుతుంది. అమ్మవారిని దర్శించిన భక్తులు  అక్కడ నుంచి ఆటో, కారు, ఇతర వాహనాల ద్వారా కేవలం 10 నిమషాల వ్యవధిలోనే  కిలోమీటరున్నర దూరంలో ఉన్న కోట ప్రాంతానికి చేరుకోవచ్చు. కోట సమీపంలోని మూడులాంతర్లు వద్ద ఉన్న చదురుగుడిలో పైడితల్లిని దర్శించుకుని తరించి అమ్మవారి కృప పొందవచ్చు.

ఈ ఏడాది అమ్మవారి ఉత్సవాలకు సెప్టెంబరు 12న పందిరిరాటతో శ్రీకారం చుట్టారు. ఆ రోజు చదురగుడి, వనం గుడి వద్ద పందిరి రాట వేశారు. అదేరోజు అమ్మవారి మండల దీక్షలను చదురగుడి వద్ద ప్రారంభించారు. అక్టోబరు 2న అర్ధమండల దీక్ష మొదలుపెట్టారు. 

అక్టోబర్‌ 6, సోమవారం తొలేళ్ల ఉత్సవం, 7, మంగళవారం సిరిమానోత్సవం జరుగుతుంది. పెద్ద చెరువులో 14న తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. 19వ తేదీ ఆదివారం వనం గుడి నుంచి కలశజ్యోతి ఊరేగింపు, 21వ తేదీన ఉయ్యాల కంబాల ఉత్సవం,  22న చండీహోమం, పూర్ణాహుతితో పైడిమాంబ ఉత్సవాలు ముగుస్తాయి. 
– బోణం గణేష్, సాక్షి ప్రతినిధి, అమరావతి, ఫొటోలు: డి. సత్యనారాయణ మూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement