
కలిసొచ్చిన జీఎస్‌టీ ధరల తగ్గింపు, నవరాత్రుల కొనుగోళ్లు
సెప్టెంబర్‌లో 18.27 లక్షల సేల్స్
నవరాత్రుల 9 రోజుల్లోనే 11.56 లక్షల విక్రయాలు
ఆటో డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడి
న్యూఢిల్లీ: పండుగ సీజన్ ప్రారంభం భారత ఆటోమొబైల్ రంగానికి తిరుగులేని ఉత్సాహాన్ని అందించింది. ముఖ్యంగా నవరాత్రి తొమ్మిది రోజుల పండుగ సందర్భంగా ప్యాసింజర్ వాహన రిటైల్ అమ్మకాలు గతేడాదితో పోలిస్తే ఏకంగా 34% పెరిగాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) వెల్లడించింది. సెప్టెంబర్ 22 వరకు మందకొడిగా సాగిన అమ్మకాలు, జీఎస్‌టీ 2.0 అమల్లోకి వచ్చాక విక్రయాలు అనూహ్య రీతిలో పెరిగాయి. వెరసి సెప్టెంబర్‌లో అన్ని విభాగాలు కలిపి మొత్తం 18,27,337 వాహన విక్రయాలు జరిగాయి. గతేడాది ఇదే నెల 17,36,760 యూనిట్లతో పోలిస్తే ఇవి 5.22% అధికంగా ఉన్నాయి. నవరాత్రుల పండుగ తొమ్మిది రోజుల్లో వాహన విక్రయాలు 34% పెరిగి 11,56,935 యూనిట్లకు చేరాయి. గత ఏడాది ఇదే సమయంలో 8,63,327 వాహనాలు అమ్ముడయ్యాయి.
‘‘భారతీయ ఆటోమొబైల్ రిటైల్ పరిశ్రమకు 2025 సెపె్టంబర్ అత్యంత ప్రత్యేకమైన నెల నిలిచింది. కొత్త జీఎస్‌టీ అమల్లోకి వస్తే ధరలు దిగి వస్తాయని అంచనాలతో కస్టమర్లు మూడో వారం వరుకూ కొనుగోళ్ల జోలికెళ్లలేదు. అయితే సెపె్టంబర్ 22 తర్వాత జీఎస్‌టీ 2.0 రేట్లు అమల్లోకి రావడం, నవరాత్రి ఉత్సవాలు ఒకేసారి రావడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అన్ని విభాగాల్లో విక్రయాలు, డెలివరీలు వేగంగా పుంజుకున్నాయి’’ అని ఫాడా ఉపాధ్యక్షుడు సాయి గిరిధర్ తెలిపారు.
విభాగాల వారీగా వృద్ధి ఇలా...
→ ప్యాసింజర్ విక్రయాలు గతేడాది సెపె్టంబర్‌తో పోలిస్తే 2,82,945 యూనిట్ల నుంచి ఏకంగా 5.80% పెరిగి 2,99,396 కు చేరాయి. భారీ కొనుగోళ్లు, అందుబాటు ధరల కారణంగా నవరాత్రుల్లో 2,17,744 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. గతేడాది ఇదే నవరాత్రి విక్రయాలు 1,61,443తో పోలిస్తే ఇవి 35% అధికం.
→ ద్వి చక్ర వాహనాల రిజి్రస్టేషన్లు 7% పెరిగాయి. ఈ సెపె్టంబర్‌లో మొత్తం 12,87,735 అమ్మకాలు జరిగాయి. గతడాది ఇదే నెలలో విక్రయాలు 12,08,996 యూనిట్లుగా ఉన్నాయి. ఈ విభాగపు ఎంక్వైరీలు ఇప్పట్టకీ బలంగా ఉన్నాయి. జీఎస్‌టీ రేట్ల తగ్గింపు, పండుగ ఆఫర్లు, డిమాండ్ పెరగడంతో నవరాత్రిలో అమ్మకాలు 36% పెరిగి 8,35,364 యూనిట్లకు చేరాయి.
→ త్రి చక్రవాహన రిటైల్ అమ్మకాలు 7% క్షీణించి 98,866కు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే సెపె్టంబర్ అమ్మకాలు 1,06,534 యూనిట్లుగా ఉన్నాయి. అయితే నవరాత్రి అమ్మకాల్లో 25% వృద్ధి నమోదైంది. మొత్తం 46,204 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది దసరా సీజన్ విక్రయాలు 37,097గా ఉన్నాయి.
→ వాణిజ్య వాహన రిటైల్ విక్రయాలు సెపె్టంబర్‌లో 70,254 యూనిట్ల నుంచి 3% పెరిగి 72,124 యూనిట్లకు చేరుకున్నాయి. రుణవితరణ పెరగడంతో నవరాత్రి అమ్మకాల్లో 15% వృద్ధి సాధించి మొత్తం 33,856 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇదే సెపె్టంబర్‌లో ట్రాక్టర్ అమ్మకాలు 64,785 యూనిట్లుగా ఉన్నాయి. ఒక్క నవరాత్రుల్లోనే 21,604 ట్రాక్టర్ల విక్రయాలు జరిగాయి.
అక్టోబర్ అమ్మకాలపై మరింత ఆశాభావం
‘‘జీఎస్‌టీ 2.0 రేట్ల తగ్గింపు అన్ని ఆదాయ వర్గాలలో కొనుగోలు శక్తిని గణనీయంగా పెంచింది. సానుకూల వర్షాలు, బలమైన ఖరీఫ్ పంటలు గ్రామీణ ఆదాయాలను మెరుగుపరిచాయి. ధంతేరాస్, దీపావళి పండుగల సీజన్‌లో ఇదే సానుకూల వాతావరణం కొనసాగొచ్చు. తగ్గిన ధరలు, ఆకట్టుకునే ఆఫర్‌లు కొత్త కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. భారతీయ చరిత్రలోనే ఈ పండుగ సీజన్ అత్యుత్తమ రిటైల్ సీజన్‌గా నిలిచే అవకాశం ఉంది’’ అని ఫాడా విశ్వాసం వ్యక్తం చేసింది.
ఈవీ కార్ల అమ్మకాలు రెండింతలు
ఎలక్ట్రిక్ కార్ల రిటైల్ విక్రయాలు ఈ ఏడాది సెపె్టంబర్‌లో 15,329 గా నమోదయ్యాయి. గతేడాది (2024) ఇదే నెలలో నమోదైన 6,191 ఈవీ కార్ల విక్రయాలతో పోలిస్తే ఈ సంఖ్య రెండింతలు అధికమని వాహన డీలర్ల సమాఖ్య (ఫాడా) తెలిపింది. ఈవీ రేసులో టాటా మోటార్స్ అగ్రస్థానంలో ఉంది. ఈ సంస్థ ఈవీ కార్ల అమ్మకాలు 62% వృద్ధి చెంది 3,833 నుంచి 6,216 కు చేరాయి. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ 3,912 ఈవీ కార్లను అమ్మింది. గతేడాది సెప్టెంబర్‌లో విక్రయించిన 1,021 యూనిట్లతో పోలిస్తే ఇవి మూడింతలు అధికం. మహీంద్రా అమ్మకాలు 475 యూనిట్ల నుంచి ఏకంగా 3,243కు చేరాయి. అలాగే బీవైడీ ఇండియా 547 యూనిట్లు, కియా ఇండియా 506 యూనిట్లు, హ్యుందాయ్ మోటార్ ఇండియా 349 యూనిట్లు, బీఎండబ్ల్యూ ఇండియా 310 యూనిట్లు, మెర్సిడస్ బెంజ్ 97 యూనిట్లను విక్రయించాయి. ఇటీవల భారత్ మార్కెట్లోకి అడుగుపెట్టిన టెస్లా సైతం 64 కార్లను విక్రయించింది.