న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ (క్యూ2)లో ప్యాసింజర్, వాణిజ్య వాహన విక్రయాల పరంగా మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచినట్లు భారత ఆటోమొబైల్ తయారీదారుల సమాఖ్య(సియామ్) తెలిపింది. ద్వి చక్రవాహన, త్రీ వీలర్స్ వాహన అమ్మకాల్లో ఉత్తరప్రదేశ్ ప్రథమస్థానంలో ఉన్నట్లు పేర్కొంది.
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం 10.39 లక్షల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడవగా, అందులో వెస్ట్రన్ జోన్(మహారాష్ట్ర, గుజరాత్, రాజస్తాన్, గోవాలతో పాటు కేంద్ర ప్రాంతాలు దాద్రానగర్ హవేలీ, డయ్యూ డామన్)లో 3.44 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇదే క్యూ2లో మొత్తం 2.40 లక్షల యూనిట్లు వాణిజ్య వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో వెస్ట్రన్ జోన్‌లో అత్యధికంగా 92,000 యూనిట్లు సీవీల విక్రయాలు జరిగాయి. సియామ్ గణాంకాలు పరిశీలిస్తే...
ఇదే ప్యాసింజర్ వాహన విభాగంలో రాష్ట్రాల పరంగా 1.31 లక్షల యూనిట్లతో మహారాష్ట్ర తొలిస్థానాన్ని దక్కించుకుంది. ఉత్తరప్రదేశ్ 1.00 లక్షలు, గుజరాత్ 87,901 యూనిట్లు తరువాత ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. నాలుగో స్థానంలో కర్ణాటక 76,422 యూనిట్లు, కేరళ 69,609 యూనిట్లతో అయిదో స్థానంలో కొనసాగుతున్నాయి.
వాణిజ్య వాహన విక్రయాల్లోనూ 37,091 యూనిట్లతో మహారాష్ట్ర హవా కొనసాగింది. గుజరాత్ 22,491 యూనిట్లు, ఉత్తరప్రదేశ్ 19,009 యూనిట్లు, తమిళనాడు 18,508 యూనిట్లు, మహారాష్ట్ర 16,743 యూనిట్లతో తరువాత స్థానాల్లో కొనసాగుతున్నాయి.
సెప్టెంబర్ త్రైమాసికంలోనే దేశవ్యాప్తంగా 55.62 లక్షల టూ వీలర్స్ అమ్ముడయ్యాయి. ఇందులోనూ 19.33 లక్షల యూనిట్లతో వెస్ట్రన్ జోన్ ముందంజలో ఉంది. ఉత్తరప్రదేశ్(6.92 లక్షలు) ప్రథమ స్థానం దక్కించుకుంది. మహారాష్ట్ర(6.29 లక్షలు), గుజరాత్(4.45 లక్షలు), తమిళనాడు(3.98 లక్షలు), రాజస్తాన్(3.60 లక్షలు) తరువాత స్థానాల్లో నిలిచాయి.
దేశ వ్యాప్తంగా క్యూ2లో మొత్తం 2.29 లక్షల త్రి చక్రవాహనాలు అమ్ముడయ్యాయి. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణా, కేరళ, ఏపీతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు పాండిచ్చేరి, లక్షదీ్వప్‌లో 77,00 యూనిట్లు విక్రయాలు జరిగాయి. రాష్ట్రాల వారీగా ఈ విభాగంలో 28,246 యూనిట్ల అమ్మకాలతో ఉత్తరప్రదేశ్ ప్రథమస్థానంలో ఉంది. తెలంగాణ (26,626 యూనిట్లు), గుజరాత్ (22,572 యూనిట్లు), మహారాష్ట్ర(21,100 యూనిట్లు), తర్వాతి స్థానాల్లో నిలిచాయి.


