28% ప్రీమియంతో రూ. 335 వద్ద ఎంట్రీ
ముంబై: టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ (టీఎంసీవీ) అరంగేట్రంలోనే అదరగొట్టింది. టాటా మోటార్స్ విభజన నేపథ్యంలో టీఎంసీవీ షేరు విలువను రూ.260గా నిర్ధారించగా.. ఎన్‌ఎస్‌ఈలో ఇది 28.48 శాతం ప్రీమియంతో రూ.335 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో రూ.345 గరిష్టాన్ని తాకింది. చివరకు 26.56 శాతం లాభంతో 330 వద్ద స్థిరపడింది. ఇక బీఎస్‌ఈలో ఇది 26.09 శాతం ప్రీమియంతో 330.25 వద్ద అరంగేట్రం చేసింది. ఇంట్రాడేలో రూ. 346.75ను తాకి, చివరికి రూ.327.65 వద్ద క్లోజయ్యింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,21,517 కోట్లుగా నమోదైంది.
టాటా మోటార్స్‌ను టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ), టీఎంసీవీగా విడగొట్టిన సంగతి తెలిసిందే. టాటా మోటార్స్ ఇన్వెస్టర్లకు 1:1 నిష్పత్తిలో ఒక టీఎంసీవీ షేరును కేటాయించారు. ఈ డీమెర్జర్ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. కాగా, అక్టోబర్ 14 నుంచి టాటా మోటార్స్ షేరు టీఎంపీవీగా రూ. 400 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఇది రూ.402 వద్ద కదలాడుతోంది. టీఎంసీవీ మాత్రం టాటా మోటార్స్ లిమిటెడ్ పేరుతో ఇప్పుడు ట్రేడవుతోంది. కాగా, ఈ రెండింటి ఉమ్మడి మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.2.7 లక్షల కోట్లకు చేరింది.
నిర్ణయాత్మక క్షణం: చంద్రశేఖరన్
టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ లిస్టింగ్ అనేది కంపెనీ భవిష్యత్తు ప్రయాణానికి, అలాగే ఆటోమోటివ్ పరిశ్రమకు ఒక ‘నిర్ణయాత్మక క్షణం’ అని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ పేర్కొన్నారు. బీఎస్‌ఈలో జరిగిన లిస్టింగ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టాటా మోటార్స్‌ను ‘ఐకానిక్’ కంపెనీగా అభివరి్ణంచారు. అటువంటి ప్రతిష్టాత్మక కంపెనీలో నిర్మాణాత్మక మార్పులు చేపట్టడం చాలా కష్టమే అయినా, విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. ఈ ఏడాది జూలైలో ఇటాలియన్ వాణిజ్య వాహన దిగ్గజం ఇవెకో గ్రూప్‌ను (డిఫెన్స్ బిజినెస్ మినహా) 3.8 బిలియన్ యూరోలకు (దాదాపు రూ.38,240 కోట్లు) కొనుగోలు చేయనున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.


