సోషల్ మీడియా వినియోగం.. ఇండియన్ ఆర్మీ కొత్త రూల్స్! | Indian Army Allows Passive Participation On Social Media for Personnel | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియా వినియోగం.. ఇండియన్ ఆర్మీ కొత్త రూల్స్!

Dec 28 2025 2:47 PM | Updated on Dec 28 2025 4:05 PM

Indian Army Allows Passive Participation On Social Media for Personnel

భారత సైన్యం.. తమ సిబ్బందికి సోషల్ మీడియా వినియోగంపై ఉన్న నిబంధనలను పాక్షికంగా సవరించింది. గతంలో ఉన్న కఠినమైన నిషేధాలను సడలిస్తూ, ఎంపిక చేసిన కొన్ని ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లలో నిష్క్రియాత్మక భాగస్వామ్యాన్ని(Passive Participation) అనుమతిస్తూ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ (డీజీఎంఐ) రూపొందించిన ఈ నూతన మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

ఏమిటీ నిష్క్రియాత్మక భాగస్వామ్యం?
కొత్త విధానం ప్రకారం.. సైనిక సిబ్బంది ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌ (గతంలో ట్విట్టర్) వంటి ప్లాట్‌ఫామ్‌లను సమాచారం తెలుసుకోవడానికి లేదా కంటెంట్‌ను చూడటానికి మాత్రమే ఉపయోగించవచ్చు. అయితే.. ఈ ప్లాట్‌ఫామ్‌లలో ఎటువంటి యాక్టివ్‌ ఎంగేజ్‌మెంట్‌ ఉండకూడదు. అంటే..

➤పోస్ట్‌లు పెట్టడం, ఫొటోలు అప్‌లోడ్ చేయడం చేయకూడదు.
➤ఇతరుల పోస్టులపై వ్యాఖ్యానించడం (Commenting) నిషేధం.
➤లైక్ చేయడం, షేర్ చేయడం లేదా పోస్టులకు రియాక్ట్ అవ్వడం వంటివి చేయకూడదు.
➤డైరెక్ట్ మెసేజ్‌లు పంపడంపై కూడా నిషేధం కొనసాగుతుంది.

ఇన్‌స్టాగ్రామ్‌కు అధికారిక అనుమతి
ఈ అప్‌డేట్‌లో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌ను అధికారికంగా.. ‘పరిమిత వినియోగ’ సోషల్ మీడియా జాబితాలో చేర్చారు. కేవలం నిఘా, సమాచార సేకరణ ప్రయోజనాల కోసం మాత్రమే దీన్ని వాడాలని, వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడానికి వీల్లేదని ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి.

కమ్యూనికేషన్, ప్రొఫెషనల్ ప్లాట్‌ఫామ్‌లు
వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్కైప్ యాప్‌లను సాధారణ స్థాయి సమాచార మార్పిడికి ఉపయోగించవచ్చు. అయితే, గ్రహీత ఎవరో కచ్చితంగా తెలిసినప్పుడు మాత్రమే కమ్యూనికేట్ చేయాలి. దీనికి పూర్తి బాధ్యత సదరు సిబ్బందిదే. లింక్డ్‌ఇన్ వృత్తిపరమైన అవసరాల కోసం, అంటే రెజ్యూమ్‌లు అప్‌లోడ్ చేయడం లేదా ఉద్యోగ సమాచారం కోరడం వంటి పనులకు మాత్రమే దీన్ని అనుమతిస్తారు. యూట్యూబ్, కోరా(YouTube, Quora) వీటిని కేవలం జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి మాత్రమే వాడాలి.

కఠినమైన హెచ్చరికలు
సౌలభ్యాలను కల్పిస్తూనే సైన్యం కొన్ని అంశాలపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. క్రాక్డ్ సాఫ్ట్‌వేర్‌లు, ఉచిత మూవీ పోర్టల్స్, టొరెంట్, వెబ్ ప్రాక్సీలు, వీపీఎన్‌ సర్వీలకు వాడకూడదు. చాట్ రూమ్‌లు, ఫైల్ షేరింగ్ ప్లాట్‌ఫామ్‌ల జోలికి వెళ్లవద్దని సూచించింది. క్లౌడ్ ఆధారిత డేటా సేవల వినియోగంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

2020లో 89 యాప్‌లపై నిషేధం
జులై 2020లో చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు, సైబర్ భద్రతా ముప్పుల నేపథ్యంలో.. భారత సైన్యం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సహా 89 యాప్‌లను తక్షణమే తొలగించాలని తన సిబ్బందిని ఆదేశించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం నిషేధించిన 59 చైనా యాప్‌లు కూడా ఉన్నాయి. తాజా సవరణలు సైనిక భద్రతను కాపాడుతూనే మారుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా సిబ్బందికి కొంత వెసులుబాటు కల్పించే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement