భారీ ఇష్యూలతో సందడే సందడి
టాటా క్యాపిటల్, ఎల్‌జీ ఎల్రక్టానిక్స్
హెచ్‌డీబీ, ఐసీఐసీఐ ప్రు లిస్టింగ్ జోష్
ఇకపై రిలయన్స్ జియో, ఎన్‌ఎస్‌ఈ
ఫోన్‌పే, ఫ్లిప్‌కార్ట్, జెప్టో, బోట్, ఓయో, హీరో ఫిన్‌కార్ప్ రెడీ
ఈ కేలండర్ ఏడాది(2025) దేశీ స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారి ప్రైమరీ మార్కెట్లు లిస్టింగ్‌లతో సెంచరీ కొట్టాయి. మరోపక్క సెకండరీ మార్కెట్లు సైతం సరికొత్త గరిష్టాలను చేరడం ద్వారా చరిత్ర సృష్టించాయి. ఇందుకు ప్రధానంగా రిటైలర్లు, దేశీ ఫండ్స్ కనీవినీ ఎరుగని రీతిలో చేపడుతున్న భారీ పెట్టుబడులు తోడ్పాటునిస్తున్నాయి. దీంతో కొత్త ఏడాది(2026)లోనూ ప్రైమరీ మార్కెట్లు సుప్రసిద్ధ కంపెనీల ఐపీవోలతో కదం తొక్కేందుకు సిద్ధపడుతున్నాయి. వివరాలు చూద్దాం..
సరికొత్త చరిత్రకు తెరతీస్తూ 2025 జనవరి–డిసెంబర్ కాలంలో 103 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వచ్చాయి. తద్వారా ఇంతక్రితం ఎన్నడూలేని విధంగా రూ. 1.75 లక్షల కోట్లు సమకూర్చుకున్నాయి. నిజానికి గతేడాది(2024)లోనూ ప్రైమరీ మార్కెట్లు సందడి చేశాయి. రూ. 27,870 కోట్లు సమీకరించిన హ్యుందాయ్ మోటార్ ఇండియా తదితర ఇష్యూలతో 91 కంపెనీలు రూ. 1,59,784 కోట్లు అందుకున్నాయి.
ప్రైమ్ డేటాబేస్ వివరాల ప్రకారం ఈ రికార్డును టాటా క్యాపిటల్, హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఎల్‌జీ ఎల్రక్టానిక్స్, ఐసీఐసీఐ ప్రు ఏఎంసీ తదితరాల లిస్టింగ్‌తో 2025 అధిగమించింది. అయితే స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ, డిజిటల్ సేవల దిగ్గజం రిలయన్స్ జియోసహా.. ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పే, జెప్టో, ఓయో, బోట్, ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ తదితరాలు ఐపీవోకు క్యూ కట్టడం ద్వారా 2026లోనూ ప్రైమరీ మార్కెట్లు దుమ్మురేపే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
84 కంపెనీలకు సెబీ సై
ఈ ఏడాదిలో మార్కెట్ చరిత్రలోనే తొలిసారి సెన్సెక్స్ 86,000, నిఫ్టీ 26,000 పాయింట్ల మైలురాళ్లను అధిగమించాయి. మరోపక్క ఇప్పటివరకూ 103 కంపెనీలు రూ. 1.75 లక్షల కోట్లు సమీకరించి లిస్ట్‌కావడం ద్వారా సరికొత్త రికార్డ్ నెలకొల్పాయి. ఈ బాటలో 2026 కొత్త ఇష్యూలతో మరింత కళకళలాడనుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇప్పటికే 84 కంపెనీల ప్రాస్పెక్టస్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సహకరించనుంది.
తద్వారా రూ. 1.14 లక్షల కోట్లు సమకూర్చుకునేందుకు తెరలేవనుంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఇంతకుమించి మరో 108 కంపెనీలు సెబీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. తద్వారా రూ. 1.46 లక్షల కోట్ల నిధుల సమీకరణపై కన్నేశాయి. వెరసి 190 కంపెనీలు రూ. 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు అందుకోవడం ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు ఎదురుచూస్తున్నాయి.
కొన్నేళ్లుగా విదేశీ ఇన్వెస్టర్లకు మించి దేశీ ఇన్వెస్టర్లు స్టాక్స్‌లో భారీగా ఇన్వెస్ట్ చేస్తుండటం గమనార్హం! దీనికి కార్పొరేట్ పెట్టుబడులు సైతం జత కలుస్తుండటం విశేషమని విశ్లేషకులు తెలియజేశారు. కంపెనీలు విస్తరణ ప్రణాళికలు లేదా వృద్ధి ఆధారిత పెట్టుబడుల ప్రణాళికలు పక్కనపెట్టినప్పుడు ఆదాయ మార్గంగా మ్యూచువల్ ఫండ్ పథకాలలో అధికంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. వెరసి విదేశీ పెట్టుబడులను దేశీ ఇన్వెస్టర్లు తోసిరాజంటున్నట్లు వివరించారు.
పెట్టుబడుల విక్రయం
ఐపీవో ద్వారా పలు దిగ్గజాలు నిధుల సమీకరణ చేపడుతుండటం పెట్టుబడుల విక్రయానికి దారి చూపుతోంది. తొలి దశ ఇన్వెస్టర్లు లేదా ప్రమోటర్లు కొంత వాటా విక్రయించడం ద్వారా నిధుల సమీకరణతోపాటు పెట్టుబడులపై లాభాలను ఆర్జిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. 2025లో లిస్టయిన దిగ్గజాలను తీసుకుంటే.. ఉమ్మడిగా రూ. 1.75 లక్షల కోట్లు సమీకరించాయి.
వీటిలో కొత్తగా ఈక్విటీ జారీని పక్కనపెడితే ప్రమోటర్లు లేదా ముందస్తు ఇన్వెస్టర్లు రూ. 1.1 లక్షల కోట్లను అందుకున్నారు. టాటా క్యాపిటల్ ఐపీవోలో టాటా మోటార్స్(రూ. 15,512 కోట్లు), హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(రూ. 12,500 కోట్లు) భారీగా నిధులు సమకూర్చుకున్నాయి. ఇక ఐసీఐసీఐ ప్రు ఏఎంసీ ద్వారా యూకే భాగస్వామ్య సంస్థ రూ. 10,603 కోట్లు సమకూర్చుకుంది. ఈ బాటలో ఎల్‌జీ ఎల్రక్టానిక్స్(రూ. 11,607 కోట్లు), కేఎస్‌హెచ్ ఇంటర్నేషనల్(రూ. 290 కోట్లు)తో పాటు 2024లో స్విగ్గీ(రూ. 6,828 కోట్లు) అందుకోవడం ప్రస్తావించదగ్గ అంశం!
--సాక్షి బిజినెస్ డిస్క్


