దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ(Nifty) 257 పాయింట్లు తగ్గి 25,548 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 809 దిగజారి 82,868 వద్ద ట్రేడవుతోంది.

భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు (ఫిబ్రవరి 13, 2026) భారీ పతనాన్ని చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన బలహీన సంకేతాలు, ముఖ్యంగా ఐటీ రంగంలో చోటుచేసుకున్న భారీ అమ్మకాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
అమెరికాకు చెందిన ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్ కార్పొరేట్ లీగల్ విధులను ఆటోమేట్ చేసే కొత్త టూల్‌ను విడుదల చేయడం భారత ఐటీ రంగానికి శాపంగా మారింది. ఈ సాంకేతికత వల్ల ఐటీ కంపెనీల భవిష్యత్తు ఆదాయాలపై నీలి నీడలు కమ్ముకోవడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోయారు.
అమెరికాలో జనవరి నెలకు సంబంధించి వెలువడిన ఉద్యోగ గణాంకాలు అంచనాల కంటే మెరుగ్గా ఉన్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థకు శుభసూచకమే అయినప్పటికీ, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపును మరింత ఆలస్యం చేసే అవకాశం ఉందన్న సంకేతాలు మార్కెట్లను కలవరపెట్టాయి.
‘ప్రస్తుత పతనం ప్రధానంగా ఐటీ, గ్లోబల్ సెంటిమెంట్ వల్ల జరిగింది. అయితే, నిఫ్టీకి 25,500 వద్ద బలమైన మద్దతు ఉంది. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు నాణ్యమైన షేర్లలో ఈ పతనాన్ని కొనుగోలు అవకాశంగా చూడవచ్చు’ అని నిపుణులు సూచిస్తున్నారు.
Today Nifty position 13-02-2026(time: 9:36 am)

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


