న్యూఢిల్లీ: పండుగ సీజన్ డిమాండ్, జీఎస్‌టీ 2.0 అమలు కారణంగా ధరలు దిగిరావడంతో ఆటో కంపెనీలు అక్టోబర్‌లో డీలర్లకు రికార్డు స్థాయిలో వాహనాలను సరఫరా చేశాయని భారత ఆటోమొబైల్ తయారీదారుల సమాఖ్య (సియామ్) తెలిపింది. ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహనాలకు సంబంధించి ఇప్పటివరకు ఒక నెలలో ఇవే అత్యధిక టోకు విక్రయాలు అని పేర్కొంది. సియామ్ గణాంకాల ప్రకారం..
గత నెలలో కంపెనీల నుంచి డీలర్లకు మొత్తం 4,60,739 ప్రయాణికుల వాహనాలు సరఫరా అయ్యాయి. గతేడాది ఇదే అక్టోబర్ సరఫరాలు 3,93,238 యూనిట్లతో పోలిస్తే ఇవి 17% అధికంగా ఉన్నాయి.
వార్షిక ప్రాతిపదికన ద్విచక్రవాహనాల సరఫరా 2% పెరిగి 22,10,727 యూనిట్లకు చేరింది. స్కూటర్ల సరఫరాలు 7,21,200 యూనిట్ల నుంచి 8,24,003కు చేరాయి. అయితే మెటార్ సైకిళ్ల విక్రయాలు 4% తగ్గి 13,35,468 యూనిట్లకు పరిమితమయ్యాయి.
త్రిచక్ర వాహనాల టోకు విక్రయాలు 6% పెరిగి 81,288 వాహనాలకు చేరాయి.
‘‘వ్యవస్థలో కొంత రవాణా సరఫరా సమస్యలున్నప్పట్టకీ.., అక్టోబర్‌లో ప్యాసింజర్, టూ వీలర్స్, త్రీవీలర్స్‌లు రికార్డు స్థాయిలో డీలర్లకు సరఫరా అయ్యాయి. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్‌టీ రేట్ల తగ్గింపు అమల్లోకి రావడంతో వాహనాల కొనేవారి సంఖ్య పెరిగింది. అందుకే రిజిస్ట్రేషన్లు హోల్‌సేల్ కంటే అధికంగా నమోదయ్యాయి’’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు.


