సాక్షి, విజయవాడ: నకిలీ మద్యం కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అన్నంత పని చేశారు. విజయవాడ కననదుర్గమ్మ అమ్మవారి ఎదుట సత్యప్రమాణం చేశారు. సోమవారం తన కుటుంబ సభ్యులతో కలిసి గుడికి చేరుకున్న ఆయన.. ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ వద్ద చేతిలో దివ్వెను వెలిగించుకుని ఈ వ్యవహారంలో తనకే సంబంధం లేదని అన్నారు.
నా వ్యక్తిత్వంపై నింద వేశారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేయాలని చూశారు. నా మనసును బాధ పెట్టారు. అందుకే కుటుంబంతో సహా వచ్చా. నేను ఏ తప్పు చేయలేదని నిండు మనసుతో అమ్మవారి ఎదుట ప్రమాణం చేశా. నా కుటుంబాన్ని అవమానపరిచి నా హృదయాన్ని గాయపరిచిన వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మని కోరుకున్నా. నేను ఏ తప్పు చేయను చేయలేదు. తిరుపతి వెంకటేశ్వర స్వామి బెజవాడ దుర్గమ్మ పై ప్రమాణానికి నేను సిద్ధమని నేను చెప్పాను. ఆ సవాలకు కట్టుబడి నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేశారు. నకిలీ మద్యం కేసులో నార్కో అనాలసిస్ టెస్ట్ , లై డిటెక్టర్ టెస్ట్ కు నేను సిద్ధం అని అన్నారాయన.
‘‘నకిలీ మద్యం కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు. మరి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇప్పుడు ఏం చెబుతారు?. నాపై తప్పుడు ఆరోపణలు చేసినవాళ్లు సత్యప్రమాణానికి సిద్ధమా?. పోనీ.. లైడిటెక్టర్ టెస్టుకైనా వచ్చే దమ్ముందా?. కనక దుర్గమ్మ సాక్షిగా వాళ్లు నేను తప్పు చేసినట్లు నిరూపించాలి’’ అని జోగి రమేష్ మరోమారు సవాల్ విసిరారు.


