
ఎన్టీఆర్, సాక్షి: సొంత సామాజిక వర్గ నేతలనే చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తుండడంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి అక్రమ కేసులతో అరెస్టైన వల్లభనేని వంశీని విజయవాడ సబ్ జైల్లో మంగళవారం పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.
వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)ని చంద్రబాబు టార్గెట్ చేయడం వెనుక కారణం ఉంది. తన సామాజిక వర్గానికి చెందిన వంశీ ఎదుగుదలను చంద్రబాబు సహించలేకపోయారు. అందుకే తప్పుడు కేసులు పెట్టారు. ఆ సామాజిక వర్గంలో వాళ్లకు అనుకూలంగా ఉండాలి. లేకుంటే.. వెలివేస్తారు. కుదిరితే ఇలా కేసులతో ఇబ్బంది పెడతారు. అదీ చంద్రబాబు మనస్తతత్వం.
తనకన్నా, లోకేష్ కన్నా గ్లామర్ ఉంటే చంద్రబాబు(Chandrababu) సహించలేరు. తమ సామాజిక వర్గంలో ఎవరైనా ఎదుగుతుంటే.. వాళ్లిద్దరూ తట్టుకోలేరు. అందుకే వంశీ అంటే చంద్రబాబుకి అంత మంట. అలాంటి వారిపై తప్పుడు ఫిర్యాదులు చేయించడం.. అక్రమ అరెస్టులు, ట్రోల్ చేయించడం వాళ్లిద్దరి నైజం. ఇందుకు చంద్రబాబు కోసమే పని చేసే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. బాబు మాఫియా రాజ్యం(Babu Mafia) నడుస్తోంది. రేపు దేవినేని అవినాష్ లాంటి వారిని కూడా ఇబ్బంది పెట్టొచ్చు’’ అని వైఎస్ జగన్ అన్నారు.