
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నం ప్రజలతో కొల్లు రవీంద్ర ఆటలాడుతున్నారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన మచిలీపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కొల్లు రవీంద్ర స్వార్థం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. చిరు వ్యాపారులను రోడ్డున పడేశారంటూ ధ్వజమెత్తారు.
‘‘కొల్లు రవీంద్ర కాంప్లెక్స్ కోసం అన్యాయంగా స్థానికులకు నోటీసులు ఇస్తున్నారు. కొల్లు రవీంద్ర బలవంతంగా భూసేకరణ చేస్తున్నారు. రోడ్డు విస్తరణ పేరుతో హడావుడిగా నోటిఫికేషన్ ఇచ్చేశారు. కొల్లు రవీంద్ర కట్టే నిర్మాణాలకు మున్సిపల్ ప్లాన్ లేదు. మున్సిపల్ ప్లాన్ లేకుండా నిర్మాణాలు చేపడుతుంటే అధికారులు ఏమయ్యారు?. సామాన్యులు ఇల్లు కట్టుకుంటే మాత్రం అధికారులు ఆపేస్తున్నారు. ఎవరైనా ఇల్లు కట్టుకుంటే టీడీపీ నేతలు 50 వేలు వసూలు చేస్తున్నారు’’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.
‘‘13వ తేదీన మున్సిపల్ అధికారులతో ఒక నోటీస్ ఇప్పించారు. జూలైలోనే మున్సిపల్ అధికారులతో కొల్లు రవీంద్ర ఓ ప్లాన్‌ను రెడీ చేసేసుకున్నారు. బెల్లపుకొట్ల సందును నేను మొదటి సారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే విస్తరణ చేశా. 2014లో మంత్రిగా ఉన్నప్పుడు రోడ్డు విస్తరణ చేయాలనే ఆలోచన రాలేదు. రోడ్డు విస్తరణపై పేపర్‌లో వచ్చే వరకూ ఎవరికీ తెలియదు. హడావిడిగా పేపర్ ప్రకటనపై మచిలీపట్నం ప్రజల్లో ఆందోళన మొదలైంది. 10 కోట్లతో మిల్లు, 20 కోట్లతో కమర్షియల్ కాంప్లెక్స్, 5 కోట్లతో గెస్ట్‌హౌస్ కడుతున్నాడు
..కొల్లు రవీంద్ర చేపట్టే ఒక్క నిర్మాణానికీ ప్లాన్లు లేవు. చిన్నచిన్న వారి పై ప్రతాపం చూపించే మున్సిపల్ కమిషనర్‌కు కొల్లు రవీంద్ర నిర్మాణాలు కనిపించలేదా?. ప్లాన్లు లేకుండా నిర్మాణాలు జరుగుతుంటే మచిలీపట్నం పట్టణ అభివృద్ధి సంస్థ(ముడా) కళ్లు మూసుకుందా?. కొల్లు రవీంద్ర అండ చూసుకుని మున్సిపల్ కమిషనర్ రెచ్చిపోతున్నాడు. సామాన్యులు ఇల్లు కట్టుకుంటుంటే మున్సిపల్ సిబ్బంది వాలిపోతున్నారు. స్థానిక టీడీపీ ఇంఛార్జ్‌లకు కమిషన్ ఇస్తేనే అనుమతులిస్తున్నారు. నువ్వు మీ ఇంఛార్జిలకు ఎంత కమిషన్ ఇచ్చావ్ కొల్లు రవీంద్ర?
..బడ్డీ కొట్లు కూలగొట్టించి నీఇంఛార్జ్‌లకు కమిషన్లు ఇప్పించి మళ్లీ అక్కడే షాపులు పెట్టించావ్. కొల్లు రవీంద్ర కడుతున్న కమర్షియల్ కాంప్లెక్స్‌కు కనీసం ప్లాన్ లేదు. తన కాంప్లెక్స్ ప్లాన్ కోసం రోడ్డును విస్తరణ చేయిస్తున్నాడు. చంద్రబాబు, లోకేష్ ఆశ్చర్యపోయే స్థాయిలో కొల్లు రవీంద్ర ఆస్తులు పోగేశాడు. ఎంతమంది కన్నీళ్లతో నువ్వు కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకుంటావ్. నీ స్వార్థం కోసం వ్యాపారుల ఉసురు పోసుకోకు. నేను ఊరు బాగు కోసం గతంలో రోడ్డు విస్తరణ చేయించా. ఈ రోజు ఎవరి బాగు కోసం మీరు ఈ రోడ్డు విస్తరణ చేయిస్తున్నావు. మచిలీపట్నం పట్టణ అభివృద్ధి సంస్థ (ముడా) ఛైర్మన్ పదవి ఇప్పిస్తానని రూ.5 కోట్లు తీసుకున్నావు. లోకేష్ దగ్గర పెండింగ్ ఉందని మరో కోటి 70 లక్షలు తీసుకున్నది నిజం కాదా?
..ఉచ్ఛనీచాలు ఆలోచించకుండా పాపాలు చేయడం దేనికి కొల్లు రవీంద్ర. నువ్వు, చంద్రబాబు కలిసి 650 ఎకరాల ముడా భూమి తవ్వింది నిజం కాదా?. నేను చెప్పింది నిజమో కాదో ముడా పదవికి రాజీనామా చేసిన బీజేపి నేతను అడగండి చెబుతాడు. బెజవాడలోనో.. హైదరాబాద్‌లోనో కట్టుకోవచ్చు కదా. మచిలీపట్నంలోనే నీ మల్టీ కాంప్లెక్స్ ఎందుకు కట్టడం?. తన కమర్షియల్ కాంప్లెక్స్ కోసం స్వార్థంతో రోడ్డు విస్తరణ చేస్తున్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టి కమర్షియల్ కాంప్లెక్స్ కడతానంటే చూస్తూ ఊరుకునేది లేదు. బలవంతంగా కొల్లు రవీంద్ర షాపింగ్ కాంప్లెక్స్ కట్టలేడు. కొల్లు రవీంద్ర చేస్తున్న పాపం.. దగాపై ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. చంద్రబాబుకి పిటిషన్లు పెడతాం. హైకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తాం
..పోలీసులను ఉపయోగించి బలవంతంగా ఆర్యవైశ్యుల ఆస్తులు లాక్కోవాలని చూస్తే ఊరుకోం. కృత్తివెన్నులో 35 ఎకరాల ఆర్య వైశ్యుల ఆస్తులను కొట్టేశావ్. బెంగుళూరులో ఉన్న వారిపై అక్రమంగా కేసులు పెట్టావ్. జగన్ మళ్లీ అధికారంలోకి రాగానే కచ్చితంగా నీ అక్రమ కేసుల సంగతి తేలుస్తాం. బీచ్‌లో ఫెస్టివల్ తప్ప బందరుకు నువ్వు చేసిందేంటి?. మచిలీపట్నంలో రోడ్డు విస్తరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. కొల్లు రవీంద్రను ఎదుర్కోలేకే... సామాన్యులు నన్ను ఆశ్రయించారు. నన్ను సాయం కోరిన వారికి కచ్చితంగా నేను అండగా ఉంటా’’ పేర్ని నాని పేర్కొన్నారు.