సాక్షి, హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరో సారి సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రజలు ఏం చేయలేరని అనుకుంటున్నావా? అంటూ ప్రశ్నలు సంధించారు. తెలంగాణ పౌరుషం ఉన్న ప్రతీ ఒక్కరూ పవన్ మాటలను ఖండించాల్సిందే అని కామెంట్స్ చేశారు.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తాజాగా మాట్లాడుతూ..‘తెలంగాణ విషయంలో పవన్ కళ్యాణ్ తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటివరకు ఎందుకు క్షమాపణ చెప్పడం లేదు. పవన్ క్షమాపణ చెప్పేంత వరకు జడ్చర్ల నియోజకవర్గంలో ఆయన సినిమా మాత్రం ఆడనిచ్చేది లేదు. తెలంగాణ పౌరుషం ఉన్న ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ మాటలను ఖండించాల్సిందే. తెలంగాణ ప్రజలను నర దిష్టి అంటూ రాక్షసులతో పోల్చడం కరెక్ట్ కాదు. నేను పవన్ ఫ్యాన్ అయినా తెలంగాణను చులకనగా చూస్తాను అంటే సహించేది లేదు.
మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు రేట్లు పెంచాలంటే 20 శాతం కార్మికులకు ఇవ్వాలని నిబంధనపై జీవో ఇవ్వాలి. మిగతా ఎమ్మెల్యేలు కూడా రిక్వెస్ట్ చేస్తున్న తెలంగాణ ప్రాంతం విషయంలో ఒకతాటిపై ఉందాం. ఇప్పటికే స్పందించిన నేతలందరికీ కూడా నా తరపున ప్రత్యేక కృతజ్ఞతలు’ అని కామెంట్స్ చేశారు.
అంతకుముందు కూడా పవన్‌పై అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సింగిల్‌గా ఎన్నికలకు పోయే దమ్ము లేకనే పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. చిరంజీవి లేకపోతే పవన్‌ను ఎవ్వరూ చూడరని అన్నారు. హైదరాబాద్‌లో ఆస్తులు కొంటున్నావనే ప్రచారం జరుగుతోందని, తెలంగాణ ప్రజలంటే అంత చిన్న చూపా? అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్‌లోని ఆస్తులు అమ్మేయాలని ఛాలెంజ్ చేశారు. ఏపీపై అంత ప్రేమ ఉంటే హైదరాబాద్‌లో ఎందుకుంటున్నావని ప్రశ్నించారు. విజయవాడలో ఉండి, ఏపీ ప్రజలకు సేవ చేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము ఉందా నీకు? అంటూ పవన్ కల్యాణ్‌ను నిలదీశారు.


