చిన్నశంకరంపేట (మెదక్): బిడ్డను తన నుంచి వేరు చేస్తారనే ఆందోళనతో రెండేళ్ల బిడ్డకు ఉరివేసి.. తాను ఉరివేసుకుని ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. నార్సింగి మండలం సంకాపూర్ గ్రామానికి చెందిన తాళ్ల ఆఖిల చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరం కాగా, మేనమామ సిద్దాగౌడ్ వద్ద పెరిగింది. రెండేళ్ల క్రితం ఖాజాపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్‌గౌడ్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఆరు నెలల క్రితం ప్రవీణ్‌గౌడ్ నిద్రలో హఠాన్మరణం చెందాడు.
అప్పటికే వారికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. భర్త దశదిన కర్మ నుంచే బిడ్డను మాకు ఇచ్చేసి మరో పెళ్లి చేసుకోవాలంటూ అఖిలకు అత్తింటి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. తన బిడ్డను వదిలేదిలేదన్న అఖిల.. మేనమామ ఇంటి వద్దనే ఆరు నెలలుగా జీవిస్తుంది. అత్తింటి వారు మరోసారి సంకాపూర్‌లో ఉన్న కోడలు వద్దకు వెళ్లి ఇందిరమ్మ చీర వచ్చింది తీసుకెళ్లాలంటూ ఆదివారం అత్తింటికి తీసుకువచ్చారు. ఏమైందో ఏమో కానీ మంగళవారం ఉదయం అత్త ఇంటి ముందు బట్టలు ఉతుకుతున్న సమయంలో తన రెండేళ్ల కుమారుడు రియన్స్‌కు ఉరివేసి, అదే చీరతో తాను ఉరివేసుకుని అఖిల ఆత్మహత్యకు పాల్పడింది.
విషయం తెలుసుకున్న మృతురాలి మేనమామ సిద్దాగౌడ్ అత్తింటి వేధింపులే తన మేనకోడలు, మనవడి మృతికి కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బిడ్డను వేరుచేయాలనే అత్తింటి వేధింపులు తట్టుకోలేకనే తన మేనకోడలు మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రామాయంపేట సీఐ వెంకటరాజంగౌడ్, చిన్నశంకరంపేట ఎస్‌ఐ నారాయణగౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని శవపంచనామా నిర్వహించి అత్తమామలపై కేసు నమోదు చేశారు.


