టేక్మాల్ (మెదక్): వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యను చంపి, ఆపై భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బరి్ధపూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... బర్దిపూర్ గ్రామానికి చెందిన గంగారం శ్రీశైలం (37), మంజుల (35) దంపతుల కుమారుడు ప్రవీణ్ మధుమేహ వ్యాధిగ్రస్తుడు కావడంతో చికిత్స కోసం నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడే పనిచేసుకుంటూ జీవనం సాగించారు.
అయితే భార్య మంజుల ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న శ్రీశైలం ఈ ఏడాది దసరా పండుగ సమయంలో సొంత గ్రామమైన బర్దిపూర్‌కు మకాం మార్చాడు. ఈ విషయమై తరచుగా గొడవపడుతుండగా గత నెల టేక్మాల్ పోలీసులు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. భార్యపై అనుమానంతో శ్రీశైలం మద్యానికి బానిసయ్యాడు. తన భార్యను చంపేస్తానని, తనను తలెత్తుకోలేకుండా చేస్తోందని తన స్నేహితులు, గ్రామస్తులతో తరచూ అంటుండేవాడు.
ఈ క్రమంలో కుమారుడు ప్రవీణ్ అమ్మమ్మ ఊరికి వెళ్లడంతో సోమవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న మంజుల ముఖంపై దిండు పెట్టి శ్వాసఆడకుండా చేసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం దూలానికి తాడుతో శ్రీశైలం కూడా ఉరివేసుకున్నాడు. సంఘటన స్థలంలో అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, టేక్మాల్ ఎస్‌ఐ అరవింద్, అల్లాదుర్గం ఎస్‌ఐ శంకర్, ఏఎస్‌ఐ కృష్ణ ఆధారాలను సేకరించారు.


