తమిళనాడు: నెల్లై జిల్లాలో మహిళా హాస్టల్‌లో చొరబడి భార్యను హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నెల్లై జిల్లా మేలపాళయం సమీపంలోని తరువాయికి చెందిన వ్యక్తి బాలమురుగన్. అతని భార్య శ్రీప్రియ(32). వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలమురుగన్, శ్రీప్రియల మధ్య కుటుంబ కలహాలున్నాయి. దీంతో శ్రీప్రియ తన భర్త, పిల్లలను వదిలి కోయంబత్తూరుకు వచ్చి టౌన్‌హాల్ ప్రాంతంలోని ఒక బట్టల దుకాణంలో ఉద్యోగం చేస్తోంది.
రేస్‌కోర్సు సమీపంలోని 5వ వీధిలో ఉన్న మహిళల హాస్టల్‌లో ఆమె ఉంటోంది. ఆదివారం ఉదయం శ్రీప్రియను కలిసేందుకు బాలమురుగన్ నెల్లై నుంచి వచ్చాడు. భర్త వచ్చిన విషయం తెలుసుకున్న శ్రీప్రియ బయటకు వచ్చింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన బాలమురుగన్, తాను దాచి ఉంచిన కత్తిని తీసి శ్రీప్రియపై దాడి చేశాడు. కత్తి వేటు మెడపై బలంగా పడడంతో ఆమె అక్కడికక్కడే విలవిల్లాడుతూ మృతి చెందింది. భార్య రక్తపు మడుగులో ప్రాణాల కోసం పోరాడుతూ మృతి చెందింది.
శ్రీప్రియ చనిపోయిందని నిర్ధారించుకున్నాక, మృతదేహం పక్కన ఒక కుర్చీ వేసి అందులో కూర్చుని సెల్‌ఫోన్‌లో సెల్ఫీ తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ ఫొటోను తన వాట్సాప్ స్టేటస్‌లో పోస్ట్ చేశాడు. అందులో ద్రోహానికి జీతం మరణం అని పోస్ట్ చేశాడు. దీనిపై ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బాలమురుగన్‌ను అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో శ్రీప్రియ ఒక యువకుడితో వివాహేతర సంబంధం కలిగి ఉందని, అందుకే హత్య చేశానని బాలమురుగన్ పోలీసులకు తెలిపాడు. శ్రీప్రియను హత్య చేయాలనే ఉద్దేశంతోనే ఆదివారం వచ్చానని, సముదాయించినట్లు నటించి ఆమెను హత్య చేశానని తెలిపాడు.


