సాక్షి, కరీంనగర్ జిల్లా: కరీంనగర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం సొంత అన్నను తమ్ముడే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. సీపీ గౌస్ ఆలం కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. సోదరుడిని టిప్పర్‌తో ఢీకొట్టి.. ప్రమాదంగా చిత్రీకరించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు.
రూ.కోటి 50 లక్షల అప్పుల్లో చిక్కుకున్న ప్రధాన నిందితుడు మామిడి నరేష్.. తన అప్పులు తీర్చుకోవడానికే అన్న వెంకటేశ్ పేరుపై భారీ ఇన్స్యూరెన్స్ పాలసీలు తీసుకున్నాడు. మొత్తం ఇన్స్యూరెన్స్ విలువ రూ. 4 కోట్ల 14 లక్షలు. అదనంగా యాక్సిస్ బ్యాంకులో మరో 20 లక్షల రూపాయల గోల్డ్ లోన్ అన్న పేరిట తీసుకున్న ప్రధాన నిందితుడు.. పెద్దన్నను చంపి ప్రమాదంలా చూపే పకడ్బందీ ప్లాన్ చేశాడు. స్నేహితుడు నముండ్ల రాకేశ్, డ్రైవర్ మునిగాల ప్రదీప్‌తో కలిసి కుట్ర పన్నాడు. ప్లాన్ మాట్లాడుకున్న వీడియోను రాకేశ్.. మొబైల్‌లో రికార్డ్ చేసి భద్రపరిచాడు.
గత నెల (నవంబర్ 29, శనివారం) రాత్రి టిప్పర్‌తో పెద్దన్న వెంకటేష్‌ను ఢీకొట్టాడు. టిప్పర్ బ్రేక్‌డౌన్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హత్య తర్వాత ప్రమాదంలా చూపేందుకు కుటుంబాన్ని నరేష్ తప్పుదారి పట్టించాడు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టిన రామడుగు పోలీసులు.. సాంకేతిక ఆధారాలతో కేసు ఛేదించారు. విచారణలో నిందితులు నేరం ఒప్పుకోవడంతో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. హత్య కుట్ర వీడియో ఉన్న మొబైల్, ఇన్సూరెన్స్ పాలసీలు, ఫోన్లు, బ్యాంక్ పాస్‌బుక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


