పాలకుర్తి(రామగుండం): పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని జీడీనగర్(ఘనశ్యాందాస్‌నగర్) పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా అత్తాకోడలు నామినేషన్ దాఖలు చేశారు. సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వు కాగా, మాజీ సర్పంచ్ సూర సమ్మయ్య తన తల్లి సూర నర్సమ్మతో ఆదివారం నామినేషన్ వేయించారు. మంగళవారం నర్సమ్మ పెద్దకోడలు సూర రమాదేవి సైతం నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఒకేఇంటి నుంచి అత్తాకోడలు సర్పంచ్ స్థానంలో బరిలో నిలిచినట్టయ్యింది.
గతంలో జీడీనగర్ కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. అప్పుడు ఎస్సీలకు రిజర్వు కాగా, సమ్మయ్య తన భార్య సునీత (ఎస్సీ)ను సర్పంచ్‌గా గెలుపొందించుకున్నారు. జీడీనగర్ ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటైన అనంతరం 2018లో జరిగిన ఎన్నికల్లో సూర సమ్మయ్య సర్పంచ్‌గా గెలుపొందారు. ప్రస్తుతం బీసీ మహిళకు రిజర్వు కావడంతో సమ్మయ్య తన తల్లి నర్సమ్మను బరిలో నిలిపారు. ఆయన వదిన కూడా పోటీ చేయడం గమనార్హం.


