దేశంలోనే తొలి యూనివర్సిటీగా గుర్తింపు
భవిష్యత్ అవసరాలు తీర్చే కోర్సులకు నెలవు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దేశంలోనే తొలిసారిగా ఎర్త్ సైన్సెస్ కోర్సులను ఒకేచోట అందించేలా కొత్తగూడెంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏమిటి దీని నేపథ్యం..ఇందులో ఉండే కోర్సులు ఏమిటి.. ఒకసారి చూద్దాం.. కాకతీయ యూనివర్సిటీకి అనుబంధంగా కొత్తగూడెంలో ఉన్న ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని ఎర్త్ సైన్సెన్స్ యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు మార్చి 27న సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.
అనంతరం విశ్వవిద్యాలయానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా పేరు ఖరారు చేస్తూ జూన్ 5న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూనివర్సిటీకి వైస్ చాన్స్‌లర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి యోగితా రాణాను జూన్ 30న నియమించారు. ఈ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌కు సంబంధించి జియాలజీ, ఎని్వరాన్‌మెంటల్ సైన్స్, జియో ఫిజిక్స్, జియో కెమిస్ట్రీ కోర్సులు ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లోనూ ఈ కోర్సులు ఉన్నాయి. కాగా తొలి ఏడాది యూజీలో ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, జియాలజీ కోర్సుల్లో విద్యార్థులు చేరారు. పీజీలో ఎని్వరాన్‌మెంటల్ సైన్స్ కోర్సులో అడ్మిషన్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం వర్సిటీ ఇంజనీరింగ్ విభాగంలో మైనింగ్, కంప్యూటర్ సైన్స్, ఈఈఈ, ఈసీఈ, ఐటీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
దేశంలోనే తొలిసారిగా..: ఎర్త్ సైన్సెస్, ఎని్వరాన్‌మెంట్ విభాగాల్లో పలు కోర్సులను వేర్వేరు యూనివర్సిటీలు అందిస్తున్నాయి. ఒకచోట జియో ఫిజిక్స్ కోర్సు అందుబాటులో ఉంటే మరోచోట జియాలజీ వంటి కోర్సు అందుబాటులో ఉంది. అయితే భూమి, దాని స్వభావం, భూమిపై లభించే మూలకాలు, భూగర్భ జలాలు, భూమి పొరల్లో నిక్షిప్తమైన ఖనిజాలు తదితర అంశాలకు సంబంధించి అందుబాటులో ఉన్న కోర్సులన్నింటినీ ఒకేచోట అందించే ప్రయత్నం డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ద్వారా జరుగుతోంది. ఎర్త్ సైన్సెస్‌కు సంబంధించి దేశంలోనే ఇది తొలి వర్సిటీ అని, ఈ తరహా మరో వర్సిటీ కేవలం అమెరికాలో ఉందని చెబుతున్నారు.
భవిష్యత్‌లో కీలకం..
గడిచిన మూడు దశాబ్దాలుగా ఐటీ రంగంలో విప్లవా త్మక మార్పులు వచ్చాయి. కానీ ఈ మార్పులు ఇక్కడితో ఆగిపోవడం లేదు. సెమీ కండక్టర్ల తయారీ విభాగంలో అంతర్జాతీయంగా తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ఈ రంగంలో గుత్తాధిపత్యం సాధించిన చైనా ఏకంగా అమెరికాకే సవాల్ విసిరే స్థాయిలో ఉంది. అందుకే చైనాపై ఆర్థిక ఆంక్షలు విధించే విషయంలో అమెరికా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తోంది. రేర్ ఎర్త్ విషయంలో మన దేశం ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది.
ప్రముఖ జాతీయ పరిశోధన సంస్థలతో సింగరేణి జట్టు కట్టింది. ఈ రంగం వైపు యువత ఎక్కువగా దృష్టి సారించేలా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ దోహదం చేయనుంది. పెరుగుతున్న కాలుష్యం వల్ల ఢిల్లీ నగరం ప్రతీ ఏడాది శీతాకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ తరహా సవాళ్లను ఎదుర్కొనే నూతన ఆవిష్కరణల్లో వర్సిటీ తనవంతు సాయం చేసే అవకాశముంది. ఇక భూగర్భ జలాలపై జరిగే ఫోకస్ పెరిగితే సాగు, తాగునీటి రంగంలో మరిన్ని మేలైన యాజమాన్య పద్ధతులు అందుబాటులోకి వచ్చే అవకాశముందని అంటున్నారు.


