మహబూబాబాద్ జిల్లా: తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి ఆమె కుమార్తెను కూడా లైంగికంగా వాడుకొని గర్భవతిని చేశాడు. మళ్లీ ఆ తల్లి సాయంతోనే అబార్షన్ చేయించాడు. ఈ ఘటన ఆలస్యంగా మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో మంగళవారం వెలుగు చూసింది. బయ్యారం మండల కేంద్రంలోని ముస్తాఫానగర్‌కు చెందిన సైదులుబాబు స్థానికంగా ఉన్న మరో కాలనీకి చెందిన ఓ వివాహితతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో తల్లి లేని సమయంలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఆమె కుమార్తెను కూడా లైంగికంగా వాడుకున్నాడు.
దీంతో ఆ బాలిక గర్భవతి కావటంతో రెండు నెలల కిందట తల్లి సహాయంతో బాలికను జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించారు. ఇటీవల బాలికకు వివాహం చేసే ప్రయత్నం చేయటంతో సఖి కేంద్ర నిర్వాహకులకు విషయం తెలిసింది. బాలికను జిల్లా కేంద్రానికి తీసుకెళ్లి కౌన్సెలింగ్ నిర్వహించారు. బాలిక.. తనకు అబార్షన్ చేయించిన విషయం చెప్పడంతో వారు బయ్యారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలిక ఫిర్యాదు మేరకు లైంగికదాడికి పాల్పడిన సైదులుబాబుపై పోక్సో కేసు నమోదు చేయగా, అబార్షన్‌కు సహకరించిన బాలిక తల్లిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు గార్ల బయ్యారం సీఐ రవికుమార్ తెలిపారు.


