సాక్షి, తాడేపల్లి: రాష్ట్రం ఆర్థిక లోటులో ఉందని.. అది అర్థం చేసుకోవాలంటూ ఏపీ ప్రజల ముందు నారా చంద్రబాబు నాయుడు ఆడే డ్రామాలు తెలియంది కాదు. ఈ వంకతో ఎన్నికల సమయంలో ప్రకటించిన సంక్షేమ పథకాలను ఎగ్గొడుతూ వస్తున్నారు కూడా. అయితే రాష్ట్రం అప్పులలో కూరుకుపోతున్నా సరే.. ప్రజా సొమ్ముతో ప్రభుత్వ పెద్దల జల్సాలు మాత్రం ఆగడం లేదు..
రాష్ట్రం ఆర్ధిక లోటులో ఉన్నా సరే.. ప్రభుతవ ఖజానాకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు గండికొడుతూనే ఉన్నారు. ప్రత్యేక విమానాల్లోనే పర్యటనలకు మొగ్గు చూపిస్తున్నారు. వీకెండ్ ఎంజాయ్మెంట్‌కైతే అధికారిక పర్యటనలనే వంకతో తెగచక్కర్లు కొట్టేస్తున్నారు. దీంతో ఖర్చు తడిసి మోపెడు అవుతోంది
సీఎం అయినప్పటి నుంచి చంద్రబాబు ఇప్పటిదాకా 88 సార్లు ప్రత్యేక విమానాల్లో తిరిగారు. అయితే.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి నిజంగానే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఉదయం టిఫిన్ మంగళగిరిలో, లంచ్ తిరుపతిలో, డిన్నర్ హైదరాబాదులో.. ఇలా ఆయన ప్రత్యేక పర్యటనలకు మాత్రం లెక్కే లేకుండా పోయింది. ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్ నుంచి ఆయన కాలు కింద పెట్టడం లేదని అధికార వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి.
చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ ఇప్పటిదాకా 92సార్లు ప్రత్యేక విమానాల్లో ప్రయాణించారు. ఈ మధ్యే క్రికెట్ చూడటానికి ప్రత్యేక విమానంలో దుబాయ్, ముంబై వెళ్లారు కూడా. అయితే సొంత ఖర్చులతో ఆయన ఇదంతా చేస్తున్నారని.. ఆర్టీఐ ద్వారా ఈ విషయం తేటతెల్లమైందంటూ ఆయన వర్గీయులు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇటు వైఎస్ జగన్ మీద ఫోకస్ పెడుతూ కూటమి పెద్దల విలాసాలను ప్రజల్లోకి పోనీయకుండా ఎల్లో మీడియా జాగ్రత్త పడుతోంది.


