గంజాయి సేవిస్తున్న ఏడుగురు అరెస్టు
గుంటూరు రూరల్: జనావాసాల మధ్యలో గంజాయి సేవిస్తున్న ఏడుగురు యువకులను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 20 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అడవితక్కెళ్లపాడులోని నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వంశీధర్ వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల ప్రకారం సోమవారం అర్థరాత్రి నల్లపాడు రోడ్డులోని మిర్చి యార్డ్ సమీపంలోని ఒక కాలేజీ వద్ద కొంతమంది యువకులు గుంపులుగా కూర్చుని గంజాయి సేవిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు ఎస్‌ఐ మహేష్‌కుమార్ సిబ్బందితో కలిసి దాడిచేశారు. గంజాయి తాగుతున్న ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని సోదా చేయగా వారి వద్ద రెండు 10 గ్రాముల గంజాయి ప్యాకెట్లు లభించాయి. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు. మిర్చి యార్డు సమీపంలో నివాసం ఉండే ముప్పిరి సుబ్బారావు, వేముల యోహాన్‌ల నుంచి 10 గ్రాముల చిన్న గంజాయి ప్యాకెట్ రూ 500 లకు కొనుగోలు చేసి తాగుతుంటారని తెలిసింది. గంజాయి విక్రయిస్తున్న ముప్పిరి సుబ్బారావు, వేముల యోహానులు పరారీలో ఉన్నారన్నారు. వారి కోసం గాలింపు చేపట్టామని, వారిని కూడా త్వరలో అదుపులోకి తీసుకుని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.
20 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు


