గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్
నగరంపాలెం: జిల్లాలో గడిచిన 75 రోజుల్లో గంజాయి క్రయ, విక్రయాలకు సంబంధించి 163 మందిని గుర్తించి 28 కేసులు నమోదు చేసి 127 మందిని అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుమారు 48 కిలోల గంజాయి, 139 గ్రాముల లిక్విడ్ గంజాయిని, 28 గ్రాముల ఎండీఎం, మూడు మోటారుసైకిళ్లను సీజ్ చేశామని పేర్కొన్నారు. గంజాయి కార్యకలాపాలను గుర్తించేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా గంజాయి కార్యకలాపాలు జరిగే ప్రాంతాలు, పాత నేరస్తుల కదలికలపై నిఘా, నిరంతరం తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. అవగాహనతో అంతు చూద్దామనే ఆలోచనతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఇటీవల సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో డ్రోన్లతో గస్తీ చేస్తున్నారని తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నుంచి విముక్తి పొందేందుకు పోలీసుల సాయం పొందవచ్చని అన్నారు. స్థానికంగా ఎవరైనా గంజాయి కార్యకలాపాలు నిర్వహిస్తే స్థానిక పోలీస్‌స్టేషన్లల్లో లేదా డయల్ 112, టోల్‌ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని తెలిపారు.


