ముగిసిన దివ్యాంగుల క్రీడా పోటీలు
గుంటూరు వెస్ట్(క్రీడలు): స్థానిక బీఆర్ స్టేడియంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి దివ్యాంగుల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు మంగళవారంతో ముగిశాయి. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ దివ్యాంగులకు క్రీడా పోటీలు ఎంతో మేలు చేస్తాయన్నారు. వారిలోని ఆత్మస్థైర్యం మరింత పెరుగుతుందన్నారు. అనంతరం కోటేశ్వరరావు, జిల్లా విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల శాఖ ఏడీ దుర్గాభాయి, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి అఫ్రోజ్ ఖాన్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.


