సాక్షి, అమరావతి: దిత్వా తుపాను ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాపై దిత్వా ప్రభావం ఎక్కువగా ఉంది. కాగా, తాజాగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రానున్న 24 గంటల్లో ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
దిత్వా తుపాను ప్రభావంతో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు.. నైరుతి-పశ్చిమ బంగాళాఖాతం ఆనుకొని వాయుగుండం కొనసాగుతోంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద వాయుగుండం కదలుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గడిచిన 6 గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదిలినట్లు వెల్లడించారు. తీరం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయ్యింది. ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వైపు నెమ్మదిగా వాయుగుండం కదులుతోంది. మరో 12 గంటల్లో బలమైన అల్పపీడన ప్రాంతంగా బలహీనపడే అవకాశం ఉంది. గంటకు 45-55 కి.మీ. మేర ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
బుధవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తుపాను ప్రభావంతో గాలుల ప్రభావానికి కోతకు సిద్ధంగా ఉన్న వందల ఎకరాల వరి పంట నేల వాలింది. గాలుల ప్రభావం పెరిగితే చేతికి వచ్చిన పంట పూర్తిగా నేలమట్టం అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వర్షాల ప్రభావంతో నిజాంపట్నం హార్బర్ వద్ద మూడో నంబర్ ప్రమాద సూచిక కొనసాగుతోంది. సముద్రంలో వేటకు వెళ్లే బోట్లు అన్ని జెట్టికే పరిమితం అయ్యాయి.
తమిళనాడులో కొనసాగుతున్న వర్షాలు
బలహీనపడ్డ దిత్వా తుపాను దిశను మార్చుకున్నప్పటికీ తమిళనాడులో వర్షాలు కొనసాగుతున్నాయి. బుధవారం కూడా అనేక జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మంగళవారం చెన్నై, శివారులలో 30 చోట్ల భారీగా వర్షం పడింది. ఉత్తర చెన్నై పరిధిలోని ఎన్నూరులో 26 సెం.మీ., బ్రాడ్‌వేలో 25 సెం.మీ. వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై వరదలు పోటెత్తాయి. నీటి తొలగింపు పనులను వేగవంతం చేశారు. 40కి పైగా ప్రాంతాలలో ఈదురు గాలుల ధాటికి చెట్లు నేల కొరగడంతో వాటిని తొలగించారు.
ఆంధ్రప్రదేశ్ వైపుగా వాయుగుండం కదలుతుందని భావిస్తే.. అది వచ్చిన దారిలో మళ్లీ పుదుచ్చేరి వైపుగా కదలడం గమనార్హం. బుధవారం పుదుచ్చేరి–మహాబలిపురానికి మధ్యలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో చెన్నై, శివారులలో చిరు జల్లులతో వర్షం పడుతోంది. ఇక అలాగే, తిరువణ్ణామలై, విల్లుపురం, తిరుపత్తూరు, వేలూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.


