
సాక్షి, తాడేపల్లి: నకిలీ మద్యం కేసు ప్రధాన నిందితుడు జనార్దన్‌రావుతో తనకు సంబంధాలు ఉన్నట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్ సీఎం చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరారు. ఈ విషయంలో చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన విషయం తనకు లేదని.. అయితే తీవ్ర ఆరోపణల నేపథ్యంలో లై డిటెక్టర్ పరీక్షలకు కూడా తాను సిద్ధమని అన్నారాయన.
బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నారావారి సారాను చంద్రబాబు ఏరులై పారిస్తున్నారు. టీడీపీ నేతలు నకిలీ మద్యాన్ని కుటీర పరిశ్రమల్లా నడిపిస్తున్నారు. టీడీపీ నేత జనార్దన్‌రావుతో నేను ఎలాంటి చాటింగ్ చేయలేదు. అది నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమని జోగి రమేష్ అన్నారు.
తిరుమల వెంకన్న, బెజవాడ దుర్గమ్మ మీద కూడా ప్రమాణం చేస్తా. చంద్రబాబు ఇంట్లో కూడా ప్రమాణానికి నేను సిద్ధం. చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో ప్రమాణం చేయడానికి వస్తారా?. అవసరమైతే సత్య శోధన పరీక్ష(లై డిటెక్టర్)కు నేను సిద్ధం. నా సవాల్‌ను చంద్రబాబు స్వీకరిస్తారా? అని జోగి రమేష్ నిలదీశారు.
నా ఫోన్ ఇస్తా చంద్రబాబు, లోకేష్ చెక్ చేస్కోండి. ఓ గౌడ కులస్థుడి మీద దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. నీది ఓ బతుకేనా చంద్రబాబు?నా పేరు రిమాండ్ రిపోర్టులో ఉందా?.. ఫేక్ గాళ్లు కుట్రలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారాయన.

ఇదీ చదవండి: బాబు డైరెక్షన్.. జనార్దన్ యాక్షన్!